నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకోవాలి :  కలెక్టర్ కుమార్ దీపక్

నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకోవాలి :  కలెక్టర్ కుమార్ దీపక్

నస్పూర్, వెలుగు: జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల విక్రయం, కొనుగోలుపై కఠిన చర్యలు తీసుకోవా లని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. నకిలీ పత్తి విత్తనాలను అరికట్టడంపై బుధవారం కలెక్టరేట్​లో డీసీపీ ఎ.భాస్కర్, జిల్లా వ్యవసాయ అధికారి కల్పనతో కలిసి వ్యవసాయ, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు. కలె క్టర్ మాట్లాడుతూ.. నకిలీ పత్తి విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు.

గ్రామాల్లో పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ అవగాహన కార్యక్రమాలు, తనిఖీలు నిర్వహించాలన్నారు. లైసెన్స్ ఉన్న విత్తన డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనేలా రైతులకు వివరించాలని సూచించారు. నకిలీ పత్తి విత్తనాలతో పట్టాదారు, కౌలు రైతులు పంట సాగు చేస్తే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు నిలిపివేస్తారని తెలియజేయాల న్నారు.గ్రామాల్లో దళారులెవరైనా విడిగా పత్తి విత్త నాలు అమ్మితే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. 

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు 

జైపూర్: ఫర్టిలైజర్ షాపుల యజమానులు నకిలీ పత్తి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జైపూర్ ​మండల అగ్రికల్చర్ ఆఫీసర్ మార్క్ గ్లాడ్​స్టన్ హెచ్చరించారు. మండల కేంద్రంలోని పలు ఫెర్టిలైజర్ షాపులను తహసీల్దార్ వనజారెడ్డి, ఎస్సై శ్రీధర్ తో కలిసి బుధవారం తనిఖీ చేశారు.

నకిలీ పత్తి విత్తనాలు, గ్లైఫోసెట్ గడ్డి మందు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం నుంచి పర్మిషన్ ఉన్న విత్తనాలు మాత్రమే అమ్మాలని, ఎంఆర్పీ రేట్లకు విక్రయించాలన్నారు. ఫెర్టిలైజర్ షాపుల లైసెన్సును, పీవోఎస్ మెషీన్లను తనిఖీ చేశారు.

లక్సెట్టిపేటలో తనిఖీలు 

లక్సెట్టిపేట: లక్సెట్టిపేట పట్టణంలోని పలు సీడ్ డీలర్స్ దుకాణాలు, గోదాములను మండల టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. బిల్లులు, రిజిస్టర్లను పరిశీలించారు. నకిలీ పత్తి విత్తనాలను అరికట్టడమే లక్ష్యంగా పనిచేస్తామని మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్ తెలిపారు. తహసీల్దార్ దిలీప్ కుమార్, సర్కిల్ ఇన్​స్పెక్టర్ అల్లం నరేందర్ పాల్గొన్నారు.