రూ.30కే భోజనం.. మంచిర్యాలలో పేదల ఆకలి తీరుస్తున్న వస్ర్త వ్యాపారి

 రూ.30కే భోజనం.. మంచిర్యాలలో పేదల ఆకలి తీరుస్తున్న వస్ర్త వ్యాపారి
  • రోజూ 200 మందికి పైగా వడ్డన
  • నెలకు రూ.50 వేల దాకా ఖర్చు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఓ వస్ర్త వ్యాపారి రూ.30కే భోజనం అందిస్తూ పేదల ఆకలి తీరుస్తున్నాడు. ఆశ్రయ్​ వెల్ఫేర్ ​ట్రస్ట్​ ఆధ్వర్యంలో శ్రీ కార్తీక్ మహారాజ్​ భోజనశాల పేరిట రోజూ 200 మందికి పైగా వడ్డిస్తున్నారు. వంట సరుకులు, వర్కర్ల జీతాలతో కలిపి నెలకు రూ.50వేల దాక ఖర్చుపెడుతున్నారు. వస్ర్త వ్యాపారంలో తాను సంపాదించిన సొమ్ములో కొంత సామాజిక సేవకు వెచ్చిస్తున్నానని అంటున్నారు ఎస్​వీఎస్​ ఫ్యాషన్ ​హౌస్​యజమాని సందీప్ ​అగర్వాల్. తన షాపు వెనుకాల ఉన్న ఖాళీ జాగలో కిచెన్​ షెడ్డు ఏర్పాటుచేసి అక్కడే వంటలు చేసి పెడుతున్నారు. ఆయన​సేవా నిరతిని పలువురు అభినందిస్తున్నారు.

ఆకలి తీర్చుకుంటున్న పేదలు 

కార్తీక్ ​మహారాజ్​ భోజన శాలలో రూ.30కే అందించే భోజనంతో పేదలు తమ ఆకలి తీర్చుకుంటున్నారు. మార్కెట్​లోని షాపింగ్​ మాల్స్​లో పనిచేసే వర్కర్లు, వివిధ ప్రాంతాల నుంచి మార్కెట్​కు వచ్చేవారు, చిరువ్యాపారులు, కూలీలు ఇక్కడ భోజనం చేస్తున్నారు. హోటళ్లలో తినాలంటే సాదా మీల్స్​కు కనీసం రూ.80 ఖర్చవుతోంది. కానీ ఇక్కడ తక్కువ ధరకే మంచి రుచికరమైన ఫుడ్డు పెడుతుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఈ భోజనశాల నడిపిస్తున్నారు. 

రైస్​తో పాటు రోజుకో వెజిటబుల్ ​కర్రీ లేదా పప్పుకుతోడు చట్నీ, సాంబార్​ కామన్. తాగడానికి సైతం మినరల్​ వాటర్​ అందిస్తున్నారు. వంట చేయడానికి ఒక కుక్, ఇద్దరు హెల్పర్లను నియమించారు. రోజూ 200 మందికి వంట తయారు చేస్తారు. ఎక్కువ మంది వస్తే అప్పటికప్పుడు వండి పెడతారు.

రూ.30కే కడుపు నిండుతోంది 

మాది విజయనగరం జిల్లా బొబ్బిలి. నేను ఏటా చలికాలంలో చద్దర్లు, బెడ్​ షీట్లు అమ్మడానికి వస్తాను. మొన్నటివరకు హోటళ్లలో తిన్న. ఇక్కడ తక్కువ ధరకు భోజనం అందిస్తున్నందుకు ఇక్కడే తింటున్నా. రూ.30కే కడుపు నిండుతోంది. సంతోషంగా ఉంది. - దువ్వ శంకర్, చిరువ్యాపారి

నెరవేరిన ఏడేండ్ల కల

పేదలకు నా వంతు సేవ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ ఏడాది జూలై 24న నా ఆరాధ్య దైవం చప్రాడ కార్తీక్ మహరాజ్​ పేరిట భోజనశాలను ప్రారంభించాను. రానున్న రోజుల్లో అనాథాశ్రమం ఏర్పాటుతో పాటు సేవా కార్యక్రమాలను విస్తరించాలనుకుంటున్నా. - సందీప్​ అగర్వాల్, భోజనశాల నిర్వాహకులు