
- కాళేశ్వరం బ్యాక్‌వాటర్‌తో.. మంచిర్యాల గ్రాఫ్ డౌన్
- ముంపు కాలనీల్లో సగానికి పడిపోయిన ఇండ్లు, ప్లాట్ల రేట్లు
- చాలా ఏరియాల్లో కిరాయిలకూ వస్తలేరు
- వేలాడుతున్న టులెట్, హౌస్ఫర్సేల్, ప్లాట్ ఫర్ సేల్ బోర్డులు
- అత్యవసరాలకు కూడా అమ్ముకోలేకపోతున్నామని ప్రజల ఆవేదన
- రూల్స్ పక్కనపెట్టి లే ఔట్, హౌస్ పర్మిషన్లు ఇస్తున్న ఆఫీసర్లు
మంచిర్యాల, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని మంచిర్యాలలోని గోదావరి, రాళ్లవాగు ముంపు ప్రాంతాల్లో ఇండ్లు, భూముల రేట్లు పడిపోయాయి. మార్కెట్ రేట్ల కంటే సగానికి సగం తగ్గించి అమ్ముతామన్నా కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఈ ఏరియాల్లో కిరాయిలకు సైతం ఎవరూ రావడం లేదు. చాలా చోట్ల టులెట్, హౌస్ ఫర్‌సేల్, ప్లాట్ ఫర్ సేల్ బోర్డులు కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో రేట్లు పెరుగుతాయని పైసాపైసా వెనకేసి, బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ప్లాట్లు కొని ఇండ్లు కట్టుకుంటే పరిస్థితి తలకిందులైందని ఆవేదన చెందుతున్నారు.
మూడేండ్లుగా ముంచుతున్నది
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించినప్పటి నుంచి బ్యాక్‌వాటర్‌తో మంచిర్యాల పట్టణంలోని పలు కాలనీలు మునుగుతున్నాయి. ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల గేట్లు ఎత్తినప్పుడు గోదావరికి రికార్డు స్థాయిలో వరద వస్తున్నది. ఈ వరదను కాళేశ్వరంలో భాగమైన సుందిళ్ల బ్యారేజీ అడ్డుకుంటున్నది. అదే సమయంలో జిల్లాలో భారీ వర్షాలు కురవడం వల్ల రాళ్లవాగు, తోళ్లవాగు ఉప్పొంగుతున్నాయి. దీంతో కాళేశ్వరం బ్యాక్‌వాటర్ వాగుల్లోకి పోటు కమ్ముతోంది. ఫలితంగా మంచిర్యాలలోని ఎన్టీఆర్నగర్, రాంనగర్, బాలాజీనగర్, ఎల్ఐసీ కాలనీ, పద్మశాలివాడ, మేదరివాడ, ఆదిత్య ఎన్క్లేవ్, ఎంసీహెచ్, సాయినగర్ శివారు ఏరియాలు మునుగుతున్నాయి. నిరుడు రంగంపేట, సంజీవయ్య కాలనీ, రెడ్డికాలనీతో పాటు పాత మంచిర్యాల, వేంపల్లి, ముల్కల్ల గ్రామాల్లోని కాలనీలు జలమయమయ్యాయి. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వినూత్న కాలనీ నుంచి సీతారాంపల్లి గోదావరి తీర ప్రాంతాలు మునిగాయి.
80 లక్షల ఇల్లు 40 లక్షలకు కూడా కొంటలేరు
బ్యాక్‌వాటర్ ముంపు కారణంగా మంచిర్యాల, నస్పూర్మున్సిపాలిటీలతోపాటు పాతమంచిర్యాల, ముల్కల్ల గ్రామాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇండ్లు, భూముల రేట్లు భారీగా పడిపోయాయి. కాళేశ్వరం రాకముందు ప్రజలు లక్షలకు లక్షలు అప్పులు చేసి, లోన్లు తీసుకొని ప్లాట్లు కొని ఇండ్లు కట్టుకున్నారు. కానీ ముంపు వల్ల మూడేండ్లుగా ఈ ఏరియాల్లో ఇండ్లు, భూములు అమ్ముడుపోవడం లేదు. మంచిర్యాలలోని ఓ కాలనీలో గతంలో డూప్లెక్స్హౌస్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. నాడు రూ.70 లక్షల నుంచి రూ.80 లక్షల రేటు పలికాయి. ఇప్పుడక్కడ రేట్లు సగానికి పడిపోయాయి. రూ.40 లక్షలకు కూడా ఎవరూ కొనడం లేదు. గతంలో ఓపెన్ ప్లాట్లు గజానికి రూ.15 వేల నుంచి రూ.16వేలు పలికాయి. ఇప్పుడు రూ.10వేలకు కూడా కొంటలేరని చెప్తున్నారు. దీంతో ముంపు ప్రాంతాల్లో తక్కువ రేట్లకు అమ్ముకోలేక, అక్కడ ఉండలేక, వేరే చోట కొనుక్కోలేక జనం తిప్పలు పడుతున్నారు. ఇండ్లలో కిరాయిలకు కూడా ఎవరూ రావడం లేదని వాపోతున్నారు.
రియల్టర్లు, ఆఫీసర్లు కలిసి ముంచుతున్నరు..
మంచిర్యాల, పాతమంచిర్యాల, వేంపల్లి, ముల్కల్ల, నస్పూర్‌లలో గోదావరి, రాళ్లవాగు, తోళ్లవాగు తీర ప్రాంతాల్లో ఇప్పటికీ రియల్ ఎస్టేట్వెంచర్లు వెలుస్తున్నాయి. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లో యథేచ్ఛగా నాలా కన్వర్షన్, లే అవుట్ పర్మిషన్లు, హౌస్ పర్మిషన్లు ఇస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో పర్మిషన్లు ఇవ్వరాదన్న రూల్స్‌ను అధికారులు పట్టించుకోవడం లేదు.
లక్షల్లో నష్టపోతున్న బాధితులు..
కాళేశ్వరం బ్యాక్‌వాటర్ కారణంగా ఇండ్లు పూర్తిగా మునుగు తుండడంతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇండ్లలోని విలువైన వస్తువులు, వంటసామాన్లు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ పరికరాలు మునిగి పనిరాకుండా పోతున్నాయి. ఇంట్లో వైరింగ్, వాహనాలు దెబ్బతింటున్నాయి. నిరుడు చాలా ఏరియాల్లో గ్రౌండ్‌ఫ్లోర్ పూర్తిగా మునిగి ఫస్ట్ ఫ్లోర్ లోకి నీళ్లు చేరాయి. ఒక్కో ఇంట్లో కనీసం రూ.50 వేల నుంచి రూ.5లక్షలకు పైగా నష్టం జరిగింది. ఇండ్లకు రిపేర్లు చేయించడానికి రూ.లక్షల్లో ఖర్చయ్యాయి. తాజాగా మరోసారి బ్యాక్‌వాటర్ ముంచెత్తడంతో ఆయా కాలనీల్లో ఉండేందుకు జనం జంకుతున్నారు.