కార్పొరేషన్​తో భూముల ధరలకు రెక్కలు

కార్పొరేషన్​తో భూముల ధరలకు రెక్కలు
  • మంచిర్యాలలో భారీగా పెరుగుతున్న ల్యాండ్​ రేట్లు
  • వేంపల్లి నుంచి గుడిపేట దాకా హైక్​ చేస్తున్న రియల్టర్లు
  • విలీన గ్రామాల్లో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న వెంచర్లు
  • ప్రజలపై రిజిస్ట్రేషన్​ చార్జీలు, టాక్స్​ల భారం

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల గ్రేడ్​1 మున్సిపాలిటీ కార్పొరేషన్​గా అప్​గ్రేడ్​ కావడంతో ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. కార్పొరేషన్ పేరు చెప్పి రియల్టర్లు రేట్లు హైక్​ చేస్తున్నారు. శివారు ఏరియాల్లో మొన్నటిదాకా గజం రూ.ఐదారు వేలు పలికిన భూములకు ఇప్పుడు రూ.10 వేలు చెప్తున్నారు. మంచిర్యాలలోని ప్రైమ్​ లొకేషన్స్​లో గజం రూ.15 వేల దాక ఉండగా మరో రూ.5 వేలు పెంచారు. 

ఇప్పటికే హైటెక్​సిటీ, గ్రీన్​సిటీ వంటి చోట్ల రూ.20 వేల నుంచి రూ.30వేలు పలుకుతోంది. దీంతో జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లోని లే అవుట్లలో సామాన్యులు గుంట జాగ కూడా కొనే పరిస్థితి లేదు. నాన్​లే అవుట్లలో ధరలు అందుబాటులో ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్లు కావడం లేదని, కార్పొరేషన్​లో ఇంటి పర్మిషన్లు వస్తాయో లేదోనని వెనక్కి తగ్గుతున్నారు. 

వేంపల్లి, ముల్కల్ల, గుడిపేట ప్రాతాల్లో..

మంచిర్యాల కార్పొరేషన్​లో పక్కనున్న నస్పూర్​మున్సిపాలిటీతో పాటు హాజీపూర్​ మండలంలోని వేంపల్లి, ముల్కల్ల, పోచంపాడ్, కొత్తపల్లి, గుడిపేట, నర్సింగాపూర్, నంనూర్, చందనాపూర్​ గ్రామాలను విలీనం చేశారు. దీంతో శ్రీరాంపూర్​ నుంచి గుడిపేట దాక దాదాపు 150 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో కార్పొరేషన్ ​ఏర్పాటైంది. దీంతో ఈ ప్రాంతాల్లో భూముల ధరలను భారీగా పెంచుతున్నారు. నస్పూర్​లో కలెక్టరేట్​ చుట్టుపక్కల భూములకు విపరీతంగా డిమాండ్ ఉన్నప్పటికీ రేట్లు ఏనాడో చుక్కలనంటాయి.

ఈ కారణంగా అందరి దృష్టి వేంపల్లి, ముల్కల్ల, గుడిపేట వైపు మళ్లింది. వేంపల్లి, ముల్కల్ల శివార్లలో ఇండస్ట్రియల్ హబ్, ఐటీ పార్క్​ఏర్పాటు కానున్నాయి. వీటి కోసం సుమారు 270 ఎకరాల అసైన్డ్​ భూములను సేకరిస్తున్నారు. గుడిపేటలో ఇప్పటికే 13వ పోలీస్​ బెటాలియన్ ఉండగా, మెడికల్​ కాలేజీ, కేంద్రీయ విద్యాలయం నిర్మాణంలో ఉన్నాయి. 

ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద ఇంటర్నేషనల్ ​ఫిష్​ పాండ్ రానుంది. అలాగే నేషనల్​హైవే 63లో భాగంగా గోదావరి తీరం నుంచి గ్రీన్​ఫీల్డ్​హైవే, ముల్కల్ల నుంచి క్యాతన్​పల్లి వరకు 200 ఫీట్ల బైపాస్​రోడ్డు, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలను కలుపుతూ గోదావరిపై హైలెవల్​ బ్రిడ్జి నిర్మాణానికి ప్రపోజల్స్​ ప్రభుత్వానికి చేరాయి. రానున్న రోజుల్లో ఈ ప్రాంతం బాగా డెవలప్​మెంట్​అయ్యే చాన్స్​ఉండడంతో ఇటువైపు భూములకు డిమాండ్​
ఒక్కసారిగా పెరిగింది. 

రిజిస్ట్రేషన్ చార్జీలు, టాక్స్​ల భారం

మంచిర్యాల కార్పొషన్​లో నస్పూర్​మున్సిపాలిటీ సహా సమీప గ్రామాలను విలీనం చేయడంతో భూముల రేట్లు పెరుగుతున్నాయని రియల్టర్లు ఆనందిస్తున్నారు. అయితే అదే స్థాయిలో రిజిస్ట్రేషన్​చార్జీలు, టాక్స్ భారం పెరుగుతోందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇంటి పర్మిషన్​ఫీజులు, ప్రాపర్టీ టాక్స్, నల్లా బిల్లులు, ఇండ్ల​రెంట్లు డబుల్​అయ్యే చాన్సుందని వాపోతున్నారు. 

విచ్చలవిడిగా ఇల్లీగల్ వెంచర్లు

పాత మంచిర్యాల, వేంపల్లి, ముల్కల్ల, గుడిపేట ప్రాంతాల్లో విచ్చలవిడిగా రియల్​ ఎస్టేట్​వెంచర్లు వెలుస్తున్నాయి. ఎన్​హెచ్​63 వెంట అడుగడుగునా ఇల్లీగల్​ వెంచర్లు కనిపిస్తున్నాయి. వ్యవసాయ భూములకు నాలా కన్వర్షన్​ చేసి సబ్​ రిజిస్ట్రార్​ ఆఫీసులో దొంగచాటుగా రిజిస్ట్రేషన్లు చేపిస్తున్నారు. గుడిపేటలో మెడికల్​ కాలేజీని చూపుతూ దాదాపు 20 ఎకరాల్లో డాక్టర్స్​సిటీ పేరిట, ఆ పక్కనే మామిడి తోటల వెనుక మరో 30 ఎకరాల్లో ఇల్లీగల్​ వెంచర్ ఏర్పాటు చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వెళ్లే దారిలో 10 ఎకరాల్లో మరో రెండు వెంచర్లు​వెలిశాయి. 

చందనాపూర్​కెనాల్​ పక్కనుంచి రెండు కిలోమీటర్లు వెళ్తే భువి ఇన్​ఫ్రా పేరిట 30 ఎకరాల్లో ఇంకో వెంచర్​ ఉంది. ముల్కల్ల నుంచి క్యాతన్​పల్లి వరకు ప్రతిపాదిత 200 ఫీట్ల బైపాస్​ రోడ్డులో లక్ష్మీ మెగా టౌన్​షిప్​పేరిట 70 ఎకరాల్లో ఒక వెంచర్​ఉండగా, వేంపల్లి లా కాలేజీ వెనుకాల దాదాపు 150 ఎకరాల్లో ఇల్లీగల్​వెంచర్లు ఏర్పాటు చేశారు. తిమ్మాపూర్​ నుంచి క్యాతన్​పల్లి జంక్షన్​వరకు వందల ఎకరాల్లో రియల్​ దందా జోరుగా సాగుతోంది.