టైగర్ జోన్ వరకు ఫోర్ లేన్

టైగర్ జోన్ వరకు ఫోర్ లేన్
  • లక్సెట్టిపేట నుంచి తపాల్ పూర్ వరకు రోడ్డు విస్తరణ
  • 25 ఫీట్ల నుంచి 65 ఫీట్లుగా వైడెనింగ్
  • సర్వే పూర్తి చేసిన ఆర్అండ్​బీ అధికారులు 
  • 21.6 కిలోమీటర్లు.. రూ.211 కోట్లతో డీపీఆర్

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల-–నిర్మల్​ రూట్​లో లక్సెట్టిపేట శివారులోని కరీంనగర్ చౌరస్తా నుంచి కవ్వాల్ ​టైగర్​ జోన్ ​కోర్​ఏరియా పరిధి అయిన జన్నారం మండలం తపాల్​పూర్ చెక్​పోస్టు వరకు ఫోర్ లేన్ నిర్మాణం కానుంది. దీనికి సంబంధించి ఆర్అండ్ బీ అధికారులు ఇటీవల సర్వే నిర్వహించారు. 21.6 కిలోమీటర్ల పొడవు, రూ.211 కోట్లతో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) రెడీ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి, ఆమోదం కోసం ఎదురుచూస్తున్నారు. గవర్నమెంట్ ​గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

21 కి.మీ.. రూ.211 కోట్లు

లక్సెట్టిపేట శివారులోని కరీంనగర్ చౌరస్తా నుంచి తపాల్​పూర్​ చెక్​పోస్టు వరకు 21 కిలోమీటర్ల మేర ఈ రోడ్డును నిర్మించనున్నారు. ప్రస్తుతం 25 ఫీట్ల వెడల్పున్న ఈ రోడ్డును రెండువైపులా 20 ఫీట్ల చొప్పున వైడెనింగ్​ చేసి 65 ఫీట్లుగా విస్తరించనున్నారు. ఇందుకోసం రూ.211 కోట్లు ఖర్చు అవుతుందని ఆర్అండ్ బీ అధికారులు అంచనాలు వేశారు. మ్యాదరిపేట, దండేపల్లి, తాళ్లపేట మీదుగా తపాల్​పూర్ చెక్​పోస్టు వరకు ఫోర్ లేన్ నిర్మించనున్నారు. ప్రస్తుత రోడ్డుకు ఇరువైపులా దశాబ్దాల కిందట నాటిన చెట్లు భారీ వృక్షాలుగా పెరిగి ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. రోడ్డు విస్తరణతో ఈ వృక్షాలు కనుమరుగు కానున్నాయని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

నిర్మల్ వరకు నిర్మించాలని డిమాండ్ 

మంచిర్యాల నుంచి నిర్మల్​వరకు ఫోర్ లేన్ నిర్మించాలనే డిమాండ్ చాలాకాలంగా ఉంది. రెండు జిల్లాల మధ్య కవ్వాల్ టైగర్ జోన్ విస్తరించి ఉండడంతో ఫారెస్ట్ పర్మిషన్లు రావడం కష్టతరంగా మారింది. దీంతో ఫోర్ లేన్ నిర్మాణం ఈ ప్రాంత ప్రజల కలగా మిగిలిపోయింది. మంచిర్యాల నుంచి నిర్మల్ మధ్య దూరం 140 కిలోమీటర్లు కాగా.. ప్రస్తుతం 25 ఫీట్ల రోడ్డు ఉండడం, టైగర్ జోన్ పరిధిలో వెహికల్స్​ స్పీడ్ గంటకు 30 కిలోమీటర్లు దాటరాదన్న రూల్స్ వల్ల ప్రయాణానికి దాదాపు నాలుగు గంటల సమయం పడుతోంది. ఫోర్ లేన్ నిర్మాణం జరిగితే కేవలం రెండు గంటల్లోనే చేరుకోవచ్చు. అలాగే నిర్మల్ నుంచి బాసర వరకు కూడా ఫోర్ లేన్ నిర్మించాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎకో టూరిజం డెవలప్ కావాలంటే ఇటు నిర్మల్, అటు ఆదిలాబాద్ వరకు రోడ్ల విస్తరణ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

డీపీఆర్​ పంపించాం

లక్సెట్టిపేట శివారులోని కరీంనగర్ చౌరస్తా నుంచి తపాల్​పూర్​ చెక్​పోస్టు వరకు ఫోర్​లేన్​ నిర్మాణం కోసం ఇటీవలే సర్వే నిర్వహించాం. 21.6 కిలోమీటర్లు రోడ్డు విస్తరణకు రూ.211 కోట్ల అంచనాలతో ప్రభుత్వానికి డీపీఆర్​ పంపించాం. ప్రభుత్వ ఆమోదం రాగానే పనులు ప్రారంభిస్తాం.
- భావ్​సింగ్, ఆర్అండ్​బీ ఇన్​చార్జి ఈఈ, మంచిర్యాల