
మంచిర్యాల, వెలుగు: ఈదురుగాలులు, వడగండ్ల వర్షంతో మంచిర్యాల జిల్లాలో ఆదివారం ధాన్యం తడిసిపోయింది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచిర్యాల జిల్లాలో 40.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా బెల్లంపల్లి మండలంలో 68.6 మిల్లీమీటర్లు, మంచిర్యాలలో 65.2, హాజీపూర్‌లో 60.7, మందమర్రిలో 57.4 మిల్లీమీటర్లు కురిసింది. రైతులు కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వడ్లు తడిశాయి. కొన్నిచోట్ల వరదల్లో వడ్లు కొట్టుకుపోయాయి. రైతులు నీళ్లలోంచి వడ్లను తీసుకుని ఆరబోసుకుంటున్నారు.
జిల్లావ్యాప్తంగా 3,901 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అగ్రికల్చర్ ఆఫీసర్ల ప్రాథమిక సర్వేలో తేలింది. మామిడి కాయలు రాలిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
బెల్లంపల్లి: ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షంతో సోమవారం బెల్లంపల్లి మండలంలోని ఏడు మండలాల్లోని పంటలు నేలకొరిగాయి. పెద్ద ఎత్తున ఈదురు గాలులు రావడంతో పలు చోట్ల విద్యుత్ తీగలపై చెట్లు విరిగి పడ్డాయి. దీంతో 14 గంటలపాటు మండలంతో పాటు బెల్లంపల్లి పట్టణంలో కరెంట్ సరఫరాకు అంతరాయం కలిగింది. బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి తిలక్ క్రీడా మైదానంలో వర్షపు నీరు చేరడంతో చెరువును తలపించింది. నెన్నెల, భీమిని, కన్నెపల్లి, కాసీపేట, తాండూర్, వేమనపల్లి మండలాల్లో వరి పంట పూర్తిగా నేలకొరిగింది.