కార్పొరేషన్ ​దిశగా మంచిర్యాల

కార్పొరేషన్ ​దిశగా మంచిర్యాల
  • రెండు మున్సిపాలిటీలు, 8 పంచాయతీలు విలీనం
  • ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపిన అధికారులు  ​
  • జనవరి లేదా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చే చాన్స్​
  • మ్యాప్​ రిలీజ్.. సోషల్ మీడియాలో వైరల్​

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల మున్సిపాలి టీని కార్పొరేషన్​గా అప్​గ్రేడ్ ​చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. మంచిర్యాల, నస్పూర్​మున్సిపాలిటీలతో పాటు హాజీపూర్​ మండలం లోని ఎనిమిది గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ కార్పొరేషన్​ఏర్పాటు కోసం కలెక్టర్ కుమార్​దీపక్​రెండు నెలల కిందట ప్రపోజల్స్​ పంపారు. దీనిపై స్పందించిన సీడీఎంఏ కార్పొరేషన్​ ఏర్పాటుకు అవసరమైన పూర్తి వివరాలను పంపాలని ఆదేశిస్తూ నెల క్రితం మున్సిపల్​ అధికారులకు లెటర్ రాసింది.

ఈ మేరకు మున్సిపాలిటీలు, గ్రామాల్లో జనాభా, ఓటర్లు, కుటుంబాలు, పన్నుల ద్వారా వచ్చే ఆదాయం, సాగుభూములు, వ్యవసాయేతర భూములు, సాగునీటి వనరులు తదితర వివరాలపై అధికారులు సర్వే చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే జనవరి లేదా ఫిబ్రవరిలో కార్పొరేషన్​గా ప్రకటిస్తూ నోటిఫికేషన్ రిలీజ్​ చేసే చాన్స్​ ఉన్నట్టు తెలుస్తోంది.

2.50 లక్షల జనాభా..150 చ.కి.మీ. వైశాల్యం

మంచిర్యాల, నస్పూర్​ మున్సిపాలిటీలతో పాటు హాజీపూర్​ మండలంలోని వేంపల్లి, ముల్కల్ల, గుడిపేట, చందనాపూర్, నర్సింగాపూర్, కొత్తపల్లి, పోచంపాడ్​, నంనూర్ ​గ్రామాలను విలీనం చేస్తూ కార్పొరేషన్ ​ఏర్పాటు కోసం అధికారులు ప్రపోజల్స్​పంపారు. 2011 సెన్సెస్​ప్రకారం వీటి పరిధిలో 1.63 లక్షల జనాభా ఉండగా.. ప్రస్తుతం జనాభా 2.50 లక్షలకు చేరినట్టు అంచనా. భూభాగం 150 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉంటుంది.

దీనికి సంబంధించిన మ్యాప్​ను రిలీజ్​ చేయడంతో సోషల్​మీడియాలో వైరల్​అవుతోంది. ఇప్పటికే గుడిపేటలో 13వ స్పెషల్​ పోలీస్​ బెటాయిలియన్​ ఉండగా, మెడికల్ కాలేజీ, కేంద్రీయ విద్యాలయం అక్కడే నిర్మిస్తున్నారు. వేంపల్లి, ముల్కల్ల శివార్లలో ఇండస్ట్రియల్​హబ్, ఐటీ పార్క్, ఆటో నగర్ ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోంది. కార్పొరేషన్ ఏర్పాటుతో చుట్టుపక్కల గ్రామాల్లో డెవలప్​మెంట్ ​స్పీడప్ ​అవుతుందని భావిస్తున్నారు.

నెరవేరనున్న కల 

కోల్​బెల్ట్ కేంద్రంగా, వ్యాపార వాణిజ్య కేంద్రంగా గుర్తింపు పొందిన మంచిర్యాల టౌన్ 2016లో జిల్లా కేంద్రంగా ఆవిర్భవించిన తర్వాత  స్పీడ్​గా డెవలప్ ​అవుతోంది. శివారు ప్రాంతాల్లో కొత్త కాలనీలు విస్తరించడమే కాకుండా పక్కనున్న నస్పూర్, క్యాతనపల్లి మున్సిపాలిటీలు కలిసిపోయి ఒకే టౌన్​గా మారాయి. ఈ నేపథ్యంలో నాలుగేండ్ల కిందట గత బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలోనే మంచిర్యాల మున్సిపాలిటీని కార్పొరేషన్​గా అప్​గ్రేడ్​చేయాలని ప్రయత్నాలు జరిగినా రాజకీయ కారణాల వల్ల జరగలేదు.

ALSO READ : ఆదిలాబాద్​లో ఢిల్లీస్థాయి టెంపరేచర్లు

ఈసారి అలాంటి అడ్డుంకులు రాకుండా మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మున్సిపాలిటీలు, గ్రామాలను విలీనం చేస్తూ కార్పొరేషన్​ కోసం ప్రపోజల్స్​ పంపినట్టు చెప్తున్నారు. ప్రభుత్వం జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండడంతో ఈలోపే కార్పొరేషన్​ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ముందని భావిస్తున్నారు.