లూజ్ పత్తి​ విత్తనాలను కొనొద్దు : సురేఖ

  • గ్రామాల్లో రైతులకు అవగాహన

చెన్నూరు/లక్సెట్టిపేట/కోటపల్లి, వెలుగు : వానాకాలం సీజన్ మొదలవుతున్న వేళ రైతులు సరైన విత్తనాలు కొనాలని మంచిర్యాల జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ సూచించారు. సోమవారం చెన్నూర్ మండలంలోని లింగంపల్లి, కాంబోజిపేట, చెన్నూర్ గ్రామాల్లో నకిలీ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించారు. లూజ్ విత్తనాలు కొనుగోలు చేయొద్దని, విత్తనాలు కొనుగోలు చేసిన దుకాణాల నుంచి రసీదులు తీసుకోవాలని సూచించారు.

 ఆ రసీదులను పంటకాలం పూర్తయ్యేవరకు జాగ్రత్తగా భద్రపరుచుకోవాలన్నారు. చెన్నూరు పట్టణంలోని పలు ఫెర్టిలైజర్ దుకాణాలను తనిఖీలు చేసి రికార్డులను పరిశీలించారు. నకిలీ విత్తనాలు, నిషేధిత క్రిమిసంహారక మందులు అమ్మితే షాప్ సీజ్ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దుకాణదారులను హెచ్చరించారు. చెన్నూరు ఇన్​చార్జ్ ఏడీఏ మార్క్ గ్లాడిసన్, ఏఈ ఓలు పాల్గొన్నారు.

 విత్తనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి

రైతులు నకిలీ విత్తనాల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని లక్సెట్టిపేట మండల వ్యవసాయ అధికారి ప్రభాకర్ రెడ్డి సూచించారు. మండలంలో ని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన రైతు అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఎట్టిపరిస్థితుల్లోనూ లూజ్ విత్తనాలు కొనుగోలు చేయొద్దని సూచించారు. దుకాణాల్లో విత్తనాలను తక్కువ, ఎక్కువ ధరకు అమ్మినట్లయితే వెంటనే వ్యవసాయ అధికారులకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు గోవర్ధన్ రెడ్డి, ప్రసన్న, ఇర్ఫాన యాస్మిన్, శ్రీనివాస్, అనూష, రైతులు పాల్గొన్నారు. 

నకిలీ విత్తనాలు పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని కోటపల్లి మండల వ్యవసాయ అధికారి మహేందర్, ఏఈఓ అనూష సూచించారు. మండలంలోని పిన్నారం, పారుపల్లి గ్రామాల్లో ఏఓ, జనగామ గ్రామ పంచాయతీ వద్ద ఏఈఓ రైతులకు నకిలీ విత్తనాలు పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. విత్తనాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ఎవరైనా లూజు విత్తనాలు విక్రయిస్తే కొనుగోలు చేయొద్దని, వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు.