మలయాళ ఇండస్ట్రీలో రిటైర్డ్ జడ్జి హేమ కమిటీ (Hema Committee Report) రూపొందించిన నివేదిక ప్రకంపనలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే..మలయాళ చిత్ర సీమలో పనిచేసే మహిళలు క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని హేమ కమిటీ నివేదిక వెల్లడించింది. ఈ కమిటీకి చాలా మంది మద్దతు ప్రకటించారు. టాలీవుడ్ నుంచి ఇప్పటికే నటి సమంత హేమ కమిటీ రిపోర్ట్ ను స్వాగతించారు. లేటెస్ట్ గా మా అధ్యక్షుడు మంచు విష్ణు హేమ కమిటీని సపోర్ట్ చేస్తూ టాలీవుడ్ లో కూడా కేరళ తరహాలో ఓ కమిటీ వేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.
టాలీవుడ్ లో మహిళల సేఫ్టీ ,రక్షణను మరింత మెరుగుపర్చడానికి వారి తరపున ప్రాతినిధ్యం వహించేందుకు ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని మంచు విష్ణు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంచు విష్ణు తన ఎక్స్ లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని విజ్ఞప్తి చేశారు. కెమెరా ముందు వెనుక అందరికీ సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించడానికి తాము ప్రాధాన్యత ఇస్తామన్నారు. టాలీవుడ్ అభివృద్ధికి మా ఎప్పుడు కట్టుబడి ఉందన్నారు. మహిళల భద్రత, సాధికారత కోసం ప్రతి ఒక్కరి సలహాలు సూచనలు తీసుకుంటామని తెలిపారు విష్ణు.