నస్పూర్, వెలుగు: స్మార్ట్ ఫార్ములాతో బైక్‌ను హెల్మెట్ కు అనుసంధానించడం అభినందనీయమని మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ప్రమాదాల్లో హెల్మట్ధరించకపోవడం వల్ల జరుగుతున్న ప్రాణ నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని స్మార్ట్ హెల్మెట్ ను తయారు చేసిన మంచిర్యాల కృష్ణవేణి టాలెంట్ స్కూల్ 9వ తరగతి స్టూడెంట్ వెన్నంపల్లి సిద్ధాంత్ సాయిని కలెక్టరేట్లో కలెక్టర్ అభినందించారు.
స్మార్ట్ హెల్మెట్ తలకు ధరించకపోతే బైక్ స్టార్ట్ కాకుండా వాహనానికి హెల్మెట్ సెన్సార్‌ని అనుసంధానించడం గొప్ప విషయమని కలెక్టర్ పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి చనిపోవడమే కాకుండా అతడి మీద ఆధారపడిన కుటుంబ సభ్యులు కూడా ఎంతో నష్టపోతున్నారని, ఈ నేపథ్యంలో స్మార్ట్ హెల్మెట్ ఓ మంచి ఆలోచన అని అన్నారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థి కలెక్టర్‌కు స్మార్ట్ హెల్మెట్‌ను అందజేశాడు.