మంచిర్యాల జిల్లాలో మళ్లీ పులి కలకలం

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట ఫారెస్ట్‌‌ రేంజ్‌‌ నాగారం బీట్‌‌ పరిధిలో మళ్లీ పులి కలకలం చెలరేగింది. హాజీపూర్‌‌ మండలం నాగారం పంచాయతీ దుబ్బతండా గ్రామానికి చెందిన పలువురి పశువులు శుక్రవారం మేత కోసం అడవిలోకి వెళ్లాయి. సాయంత్రం 4.30 గంటల టైంలో పశువుల మందపై పులి దాడి చేసి ఓ ఆవును చంపేసింది. సమాచారం అందుకున్న ఎఫ్‌‌ఆర్‌‌వో అత్తె సుభాశ్‌‌, సిబ్బంది శనివారం స్పాట్‌‌కు వెళ్లి పరిశీలించి, విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బాధితుడు గోపతి లస్మయ్యకు రూ.12 వేల ఎక్స్‌‌గ్రేషియా చెక్కు అందజేశారు. మళ్లీ పులి కలకలం చెలరేగడంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రెండు నెలల నుంచి ఫారెస్ట్‌‌లో పెద్ద పులులు తిరుగుతున్నాయని, వాటికి ఎలాంటి హాని చేయొద్దని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎఫ్‌‌ఆర్‌‌వో సుభాష్‌‌ తెలిపారు.