
- అనుమానాస్పద మరణంగా కేసు నమోదు
- ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాలు, బీజేపీ లీడర్లు
మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ ఉమెన్స్ రెసిడెన్షియల్ కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్ గురువారం చనిపోయింది. తన కూతురి మృతిపై అనుమానం ఉందని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... భీమిని మండలం జగ్గయ్యపేటకు చెందిన జంగపల్లి లక్ష్మీప్రసన్న (20) మంచిర్యాలలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ ఉమెన్స్ రెసిడెన్షియల్ కాలేజీలో ఉంటూ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది.
గురువారం ఉదయం 8 గంటలకు సెకండ్ ఫ్లోర్ నుంచి కింద పడడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించగా.. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ చనిపోయింది. దీంతో కాలేజీ నిర్వాహకులు స్టూడెంట్ తల్లిదండ్రులైన నాగమ్మ, గోపాల్‌కు సమాచారం ఇచ్చారు. అయితే లక్ష్మీప్రసన్న బుధవారం రాత్రి 9.30 గంటలకు సెక్యూరిటీ గార్డ్ మల్లేశం మొబైల్ తీసుకొని తన కజిన్ బ్రదర్‌కు కాల్ చేసిందని, ఫోన్‌లో ఇద్దరూ గొడవ పడ్డారని, తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని ప్రిన్సిపాల్ అనూష తెలిపారు. తన కూతురు మృతికి ప్రిన్సిపాల్ అనూష, సిబ్బందితో పాటు సెక్యూరిటీ గార్డు మల్లేశం కారణమని స్టూడెంట్ తండ్రి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ ప్రకాశ్, సీఐ ప్రమోద్‌రావు తెలిపారు.
విద్యార్థి సంఘాలు, బీజేపీ లీడర్ల ధర్నా
స్టూడెంట్ మృతి విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు, బీజేపీ లీడర్లు హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు. లక్ష్మీప్రసన్న మృతిపై అన్ని కోణాల్లో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ధర్నాకు దిగారు. బాధిత కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు ఫ్యామిలీలో ఒకరికి జాబ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఏసీపీ ఆర్.ప్రకాశ్, సీఐలు ప్రమోద్‌రావు, ఆకుల అశోక్‌తో పాటు ఎస్సైలు, సిబ్బంది హాస్పిటల్ వద్దకు చేరుకొని నచ్చజెప్పారు. చివరకు అడిషనల్ కలెక్టర్ సబావత్ మోతీలాల్ వచ్చి లక్ష్మీప్రసన్న మృతిపై ఎంక్వయిరీ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా తమకు న్యాయం చేయాలంటూ లక్ష్మీప్రసన్న తండ్రి గోపాల్ అడిషనల్ కలెక్టర్ కాళ్ల మీద పడి వేడుకున్నాడు.