హైదరాబాద్ లో సీన్ కట్ చేస్తే ఈసారి తిరుపతిలో.. మంచు ఫ్యామిలీ వార్ మొదలైంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఫ్యామిలీతో సహా తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్లిన మంచు మనోజ్ ను అడ్డుకున్నారు కాలేజీ సిబ్బంది. కాలేజీకి అనుమతి లేదంటూ గేటు దగ్గర మోహరించారు సిబ్బంది. ఈ సమయంలో ఎంట్రీ అయిన పోలీసులు సైతం.. మంచు మనోజ్ కు అనుమతి ఇవ్వలేదు. కోర్టు ఆదేశాలతో కాలేజీలోకి వెళ్లొద్దంటూ తేల్చి చెప్పారు.
కాలేజీలోకి వెళ్లటం లేదు.. కాలేజీ ఆవరణలో ఉన్న తాత, అవ్వల సమాధులకు నివాళులు అర్పించటానికి వెళుతున్నానంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు మనోజ్. గేట్లు తీయాలంటూ పెద్ద పెద్దగా కేకలు వేశాడు. కాలేజీలోని సమాధులను చూడటానికి కూడా అనుమతి కావాలా అంటూ వాగ్వాదానికి దిగాడు మనోజ్. దీంతో కాలేజీ గేటు దగ్గర గందరగోళం.. ఉద్రిక్తత నెలకొంది.
మనోజ్ కు అనుకూలంగా పెద్ద ఎత్తున అతని అనుచరులు తరలిరాగా.. కాలేజీ గేటు దగ్గర మాత్రం విష్ణు అనుచరులు, బౌన్సర్లు, కాలేజీ సిబ్బంది మోహరించారు. రెండు వర్గాల తోపులాటతో గందరగోళం నెలకొంది.
ఇదే సమయంలో కాలేజీ గేటు దూకి వెళ్లటానికి మనోజ్ ప్రయత్నించగా అడ్డుకున్నారు సిబ్బంది. దీంతో పోలీసులు మనోజ్ ను కాలేజీ మూడో గేటు నుంచి లోపలికి అనుమతించారు. ఇదే సమయంలో గేటు దగ్గర బౌన్సర్లు అడ్డుకోవటంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. బౌన్సర్లను లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు.
మోహన్ బాబు యూనివర్సిటీలో పోలీసుల మోహరింపుతో ఉద్రిక్తత నెలకొంది.