హైదరాబాద్ నేరేడ్ మెట్‌లోని రాచకొండ సీపీ కార్యాలయానికి నటుడు మంచు విష్ణు హాజరయ్యారు. గత నాలుగు రోజులుగా మంచు ఫ్యామిలీలో జరుగుతోన్న పరిణామాలు, మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీపీ సుధీర్ బాబు విష్ణును విచారించినట్లు తెలిసింది. కాగా, హైదరాబాద్ నగర శివారు జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర మంగళవారం (డిసెంబర్ 10) రాత్రి హైడ్రామా చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. శాంతి భద్రతలకు విఘాతం కలిగించారన్న ఆరోపణలపై మోహన్ బాబు, విష్ణు, మనోజ్‌లకు రాచకొండ సీపీ సుధీర్ బాబు అదనపు డిస్ట్రిక్ మేజిస్ట్రేట్ హోదాలో నోటీసులు జారీ చేశారు.
2024, డిసెంబర్ 11వ తేదీ ఉదయం 10.30 గంటలకు తమ ముందు హాజరు కావాలని ఆదేశించారు. పోలీసుల నోటీసులను హైకోర్టులో సవాల్ చేసిన మోహన్ బాబు.. ఈ నెల 24వ తేదీ వరకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. మరోవైపు సీపీ ఆదేశాల మేరకు మంచు మనోజ్ ఇవాళ ఉదయం పోలీసుల విచారణకు హాజరయ్యారు. తమ ఫ్యామిలీలో జరుగుతోన్న పరిణామాలను సీపీకి వివరించారు. మరోసారి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించనని సీపీకి రూ.లక్ష పూచికత్తుపై బాండ్ సమర్పించారు మనోజ్.
ఇదిలా ఉంటే.. పోలీసుల నోటీసులకు విష్ణు మాత్రం రెస్పాండ్ కాలేదు. అటు కోర్టును ఆశ్రయించలేదు.. ఇటు విచారణకు రాలేదు. దీంతో విష్ణుపై పోలీసులు సీరియస్ అయినట్లు తెలిసింది. దీంతో మంచు విష్ణు బుధవారం రాత్రి సీపీ ఎదుట విచారణకు హాజరయ్యారు. తన తండ్రి ఆసుపత్రిలో ఉండటంతో ఉదయం రాలేకపోయాయని విష్ణు పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. గత నాలుగు రోజులుగా మంచు ఫ్యామిలీలో జరుగుతోన్న పరిణామాలు, జల్ పల్లి నివాసాం వద్ద జరిగిన గొడవ, మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విష్ణును సీపీ సుధీర్ బాబు ప్రశ్నించినట్లు సమాచారం.
ALSO READ | మనోజ్పై దాడి కేసులో మోహన్ బాబు మేనేజర్ కిరణ్ అరెస్ట్..
మనోజ్ మాదిరిగానే విష్ణును కూడా పోలీసులు వ్యక్తిగత బాండ్ ఇవ్వాలని అడిగినట్లు తెలిసింది. మరోసారి శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని.. ఏదైనా ఉంటే ఇంట్లో చూసుకోవాలని పోలీసులు సూచించినట్లు టాక్. మంచు ఫ్యామిలీలో తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. ఒకరిపై మరొకరు కేసులు, దాడులు చేసుకోవడంతో మంచు ఫ్యామిలీ గత నాలుగు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.