గద్వాల, వెలుగు: గవర్నమెంట్ స్కూల్స్లో పేద స్టూడెంట్స్ కి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడమే తన లక్ష్యమని, ఇందు కోసం జోగులాంబ గద్వాల జిల్లాలో 30 బడులను దత్తత తీసుకున్నానని సినీ నటి, టీచ్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ మంచు లక్ష్మీప్రసన్న తెలిపారు. బుధవారం గద్వాల కలెక్టరేట్ కి వచ్చిన ఆమె కలెక్టర్ వల్లూరు క్రాంతితో భేటీ అయి స్కూళ్ల దత్తతకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ తాము దత్తత తీసుకున్నజిల్లాలోని 30 ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ క్లాసెస్, మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. ఆగస్టు వరకు పనులు పూర్తయ్యే విధంగా చూస్తామన్నారు. తాము ఇదివరకే యాదాద్రి జిల్లాలో 56 స్కూళ్లను దత్తత తీసుకుని అనుకున్న లక్ష్యాన్ని సాధించామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అపూర్వ్ చౌహన్, డీఈఓ సిరాజుద్దీన్ పాల్గొన్నారు.