జల్పల్లి/హైదరాబాద్: మోహన్ బాబు కుటుంబంలో ఏం జరుగుతుందో పూర్తిగా తెలియడం లేదు గానీ ఏదో పెద్ద గొడవే జరుగుతుంది. తాజా పరిణామాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కానీ.. మోహన్ బాబు కుటుంబంలోని ఏ ఒక్కరూ మీడియా ముందు నోరు మెదపడం లేదు. జల్పల్లిలోని మోహన్ బాబు ఫాంహౌస్ కేంద్రంగా మంచు కుటుంబంలో కొట్లాట నడుస్తోంది. ఈ వార్తలను మోహన్ బాబు పీఆర్ టీం ఖండించింది.
మంచు మనోజ్ గాయాలతో హాస్పిటల్కు వెళ్లడం, మనోజ్కు వైద్యం చేసిన డాక్టర్లు గాయాలయ్యాయని పోలీసులకు సమాచారం ఇవ్వడం.. ఈ పరిణామాలు మంచు కుటుంబంలో విభేదాలు తలెత్తాయనే వార్తలకు బలం చేకూర్చాయి. ఆదివారం(డిసెంబర్ 08-, 2024) మాత్రమే కాదు సోమవారం (డిసెంబర్ 09, 2024) ఉదయం నుంచి కూడా జల్పల్లి ఫాంహౌస్ కేంద్రంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ALSO READ | విష్ణు తరపున 40 మంది బౌన్సర్లు.. పోటీగా 30 మంది బౌన్సర్లను దింపిన మంచు మనోజ్..!
కొన్నాళ్లుగా సినీ నటుడు మోహన్ బాబు ఆయన కొడుకు మంచు మనోజ్, ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యులు జల్పల్లిలోని ఫాంహౌస్లో ఉంటున్నారు. ఆదివారం తన తండ్రి దాడి చేశాడని మంచు మనోజ్ డయల్100 కు ఫోన్ చేసి చెప్పారు. పహాడీ షరీఫ్ పోలీసులు జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి వెళ్లి విచారణ జరిపారు. తమ కుటుబంలో విభేదాలు ఉన్నాయని, వాటిని తామే పరిష్కరించుకుంటామని మోహన్‌బాబు చెప్పడంతో పోలీసులు అక్కడ నుంచి వెనుదిరిగారు.
సోమవారం కూడా జల్పల్లిలోని మోహన్ బాబు ఫాంహౌస్లో చాలానే జరిగాయి. మంచు లక్ష్మి కూడా ఈ వ్యవహారంలో సోమవారం జోక్యం చేసుకున్నట్లు తెలిసింది. జల్పల్లి ఫాం హౌస్కు ఆమె కూడా వెళ్లింది. మోహన్ బాబు, మంచు మనోజ్తో లక్ష్మి చర్చలు జరిపింది. అనంతరం.. అక్కడ నుంచి కారులో వెళ్లిపోయింది. మోహన్ బాబు కూడా జల్పల్లి ఫాం హౌస్ నుంచి వెళ్లిపోయారు. మోహన్ బాబు గతంలో ఉన్న ఫిల్మ్ నగర్ ఇంట్లో మంచు లక్ష్మి ప్రస్తుతం నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే.
ALSO READ | పెద్ద ట్విస్టే ఇది.. మంచు మనోజ్ ఇంటి చుట్టూ విష్ణు మనుషులు కాపలా !
మంచు విష్ణు తరపు బౌన్సర్లు ఫాం హౌస్ కు చేరుకున్నారని, కౌంటర్గా మంచు మనోజ్ కూడా బౌన్సర్లను దించాడని వార్తలొచ్చాయి. దీంతో.. ఇదేదో పెద్ద గొడవకే దారి తీసేలా ఉందని అంతా భావించారు. ఈ క్రమంలోనే మంచు లక్ష్మి ఫాం హౌస్కు వెళ్లింది. విదేశాల్లో ఉన్న మంచు విష్ణు వస్తున్నాడని, రాగానే ఏదో పెద్ద సీన్ జరగబోతోందని ప్రచారం జరిగింది. మంచు విష్ణు ప్రస్తుతం అమెరికాలోనే ఉన్నాడని, ఈ రోజు హైదరాబాద్ వస్తున్నారన్న వార్తల్లో నిజం లేదని మంచు విష్ణు టీం తెలిపింది. మంచు విష్ణు స్వయానా వివరాలను అధికారికంగా ప్రకటించే వరకూ ఎలాంటి వార్తలను నమ్మవద్దని పేర్కొంది.