చదువుతోనే భవిష్యత్‌ మారుతుంది : మంచు లక్ష్మి

చదువుతోనే భవిష్యత్‌ మారుతుంది : మంచు లక్ష్మి
  •     అమ్మవారి దయ ఉంటే గద్వాల జిల్లా మొత్తాన్ని దత్తత తీసుకుంటా
  •     సినీనటి, టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌ అధ్యక్షురాలు మంచు లక్ష్మి

గద్వాల, వెలుగు : చదువుతోనే పిల్లల భవిష్యత్‌, అభివృద్ధి ముడిపడి ఉంటుందని సినీనటి, టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌ సంస్థ అధ్యక్షురాలు మంచు లక్ష్మి అన్నారు. గద్వాల జిల్లా గట్టు మండలం ఆలూరు గ్రామంలో టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌, పెగాసిస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన స్మార్ట్‌ క్లాస్‌రూమ్‌ను సోమవారం ఆమె ప్రారంభించారు. అనంతరం మంచు లక్ష్మి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు సైతం అన్ని వసతులు కల్పించాలన్న ఉద్దేశంతోనే గద్వాల జిల్లాలో 51 స్కూళ్లను దత్తత తీసుకొని స్మార్ట్‌ క్లాస్‌ రూమ్స్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

జోగులాంబ అమ్మవారి దయ ఉంటే భవిష్యత్‌లో జిల్లాలోని అన్ని స్కూళ్లను దత్తత తీసుకొని స్మార్ట్‌ క్లాస్‌రూమ్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు. సర్కార్‌ స్కూళ్లలో చదివే పిల్లలకు ప్రతి చేయూత ఇవ్వాలని పిలుపునిచ్చారు. అంతకుముందు కలెక్టర్‌ సంతోష్‌తో భేటీ అయ్యారు. సంస్థకు ప్రభుత్వపరంగా సహకారం అందిస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. గట్టు మండలంలో స్కూళ్ల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను కలెక్టర్‌ అభినందించారు.