హైదరాబాద్/బడంగ్‌పేట, వెలుగు: విద్యానికేతన్ సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ వల్లే తమ కుటుంబంలో వివాదాలు పెరుగుతున్నాయని మంచు మనోజ్ అన్నారు. ‘‘విద్యానికేతన్ సంస్థల్లో వినయ్ అక్రమాలకు పాల్పడుతున్నాడు. ఈ విషయాలేవి మా నాన్న మోహన్ బాబుకు తెలియవు. నేను చెప్పినా ఆయన పట్టించుకోవడం లేదు. వినయ్ మా ఇంట్లో కూడా చిచ్చురేపాడు” అని ఆయన తెలిపారు. సీపీ ఆఫీసులో విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మా అమ్మ దవాఖానలో అడ్మిట్ అయ్యారనేది వాస్తవం కాదు.
అమ్మ ఇంటి వద్దనే ఉంది. మా అన్న విష్ణు ప్రోద్బలంతోనే ఇదంతా జరుగుతున్నది. కూర్చుని మాట్లాడుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను” అని పేర్కొన్నారు. మూడు రోజుల కింద తనపై దాడికి పాల్పడిన కిరణ్, విజయ్ పై ఫిర్యాదు చేయగా పోలీసులు వారిని అరెస్టు చేసి విచారిస్తున్నారని తెలిపారు. తమ ఇంటి వద్ద పబ్లిక్ గ్యాదరింగ్ ఉండకూడదని సీపీ చెప్పారని మనోజ్ అన్నారు. అంతకు ముందు ఫాంహౌస్ఎదుట కూడా మనోజ్ మీడియాతో మాట్లాడారు. మంగళవారం రాత్రి జర్నలిస్టులపై జరిగిన దాడికి తన తండ్రి తరఫున తాను క్షమాపణలు చెప్తున్నానన్నారు.
తనకోసం వచ్చిన జర్నలిస్టులపై ఇలా జరగడం బాధాకరమని తెలిపారు. ‘‘నాన్న అంటే నాకు ప్రాణం. మా నాన్న దేవుడు. కానీ, మా నాన్నను మా అన్న విష్ణు, వినయ్ ట్రాప్ చేశారు. వినయ్, విష్ణు కలిసి మా నాన్న భుజంపై తుపాకి పెట్టి నన్ను బలి చేయాలని చూస్తున్నారు. చోరీకి గురైన సీసీ కెమెరాలు తెప్పిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి” అని మనోజ్ అన్నారు. ఏనాడూ తాను డబ్బు కోసం, ఆస్తుల కోసం ఆశపడలేదని, తనకు నచ్చిన సినిమాలను చేసుకుంటూ ముందుకు వెళుతున్నానని చెప్పారు. తన భార్య, కొందరు స్నేహితుల సాయంతో టాయ్స్ కంపెనీ పెట్టుకొని బతుకుతున్నానని వివరించారు. గొడవల్లోకి తన భార్యను, పిల్లలను లాగుతున్నారని ఆయన కంట తడిపెట్టారు.