మరోసారి పోలీస్ స్టేషన్కు మంచు ఫ్యామిలీ.. మంచు విష్ణుపై మనోజ్ ఫిర్యాదు

మరోసారి పోలీస్ స్టేషన్కు మంచు ఫ్యామిలీ.. మంచు విష్ణుపై మనోజ్ ఫిర్యాదు

ఆ మధ్య పరస్పర ఫిర్యాదులతో మంచు ఫ్యామిలీ రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. డైలీ సీరియల్ ని తలపించేలా సాగిన ఈ ఎపిసోడ్ కొన్నాళ్ళకు సద్దుమణిగింది. మోహన్ బాబు, మంచు విష్ణులు కన్నప్ప సినిమాతో బిజీగా ఉండగా మనోజ్ కూడా అహం బ్రహ్మాస్మి వాట్ ది ఫిష్ వంటి కొత్త సినిమాలతో రీఎంట్రికి రెడీ అవుతున్నారు. ఇక మంచు ఫ్యామిలీ వివాదం గురించి అందరు మరిచిపోయిన సమయంలో మళ్ళీ రచ్చకెక్కింది మంచు ఫ్యామిలీ.. మంచు విష్ణుపై మనోజ్ ఫిర్యాదు చేయడంతో మంచు కుటుంబంలో వివాదాలు మళ్ళీ తేర మీదకు వచ్చాయి.

తాను ఇంట్లో లేనప్పుడు మంచు విష్ణు మనుషులతో తన ఇంటికి వచ్చి కార్లు, వస్తువులు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేశారు మంచు మనోజ్. జల్‌పల్లిలోని తన ఇంట్లో కూడా 150మంది చొరబడి విధ్వంసం సృష్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు మంచు మనోజ్. ఈ మేరకు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు మంచు మనోజ్. 

తన ఇంటి నుంచి చోరీ అయిన కార్లు విష్ణు ఆఫీసులో లభ్యమయ్యాయని.. తన ఇంట్లోకి గోడలు దూకి వచ్చి కార్లను ఎత్తుకొని వెళ్లారని పేర్కొన్నారు మనోజ్. ముఖ్యమైన వస్తువులన్నిటిని పగలకొట్టి విధ్వంసం చేశారని.. తన కూతురు బర్త్ డే కోసం రాజస్థాన్ కి వెళ్లగా విష్ణు తన ఇంటిని ధ్వంసం చేశారని అన్నారు.

తన ఇంట్లో జరుగుతున్న పరిణామాలపై తండ్రి మోహన్ బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించానని.. మోహన్ బాబు మాట్లాడడానికి అందుబాటులోకి రాలేదని అన్నారు. తనకు న్యాయం చేయమని పోలీసులను కలిసి విజ్ఞప్తి చేశానని అన్నారు మనోజ్.