జల్​పల్లి ఫాంహౌస్ ​వద్ద మంచు మనోజ్​ ఆందోళన

జల్​పల్లి ఫాంహౌస్ ​వద్ద మంచు మనోజ్​ ఆందోళన
  • లోపలకు అనుమతించని పోలీసులు 
  • గేటు ఎదుట బైఠాయించి నిరసన 

పహాడిషరీఫ్, వెలుగు: సినీ నటుడు మోహన్ బాబు రెండో కొడుకు మంచు మనోజ్ బుధవారం రంగారెడ్డి జిల్లా జల్​పల్లిలోని ఫాంహౌస్​వద్ద ధర్నాకు దిగాడు. కుటుంబంతో సహా లోపలకు వెళ్తుంటే పోలీసులు అడ్డుపడుతున్నారని, కోర్టు అనుమతి ఉన్నా అడ్డుకోవడం ఏమిటని ఆందోళనకు దిగారు. కొన్ని నెలలుగా ‘మంచు కుటుంబం’లో గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా సిటీలో లేని మనోజ్​మంగళవారం తన కారును ఎత్తుకెళ్లారని నార్సింగి పీఎస్​లో ఫిర్యాదు చేశారు.

బుధవారం జల్​పల్లిలోని ఫాంహౌస్​వద్దకు తన భార్యతో కలిసి వచ్చారు. పోలీసులు లోపలకు అనుమతించకపోవడంతో గేటు వద్ద బైఠాయించారు. మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ 1న తన పాప పుట్టినరోజు కోసం జైపూర్ వెళ్లానని, అదేరోజు తన ఇంట్లోని వస్తువులను నాశనం చేశారని ఆరోపించారు. ఇప్పటి వరకు తాను మూడు కేసులు పెట్టగా ఒక్కదాంట్లోనూ చార్జ్​షీట్​ఫైల్​చేయలేదన్నారు. ఇదంతా విష్ణు కావాలనే చేయిస్తున్నాడని మండిపడ్డారు.

కన్నప్ప సినిమాకు పోటీగా భైరవ సినిమా రిలీజ్ చేస్తున్నందుకు తనపై కోపం పెంచుకున్నాడన్నారు. తన ఇంట్లో పెట్స్​ఉన్నాయని, వాటిని తనకు అప్పగించాలని అడిగినా పోలీసులు వినిపించుకోవడం లేదన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తనను ఇబ్బందులు పెట్టినవాళ్లు అంతకు అంత అనుభవిస్తారని కంటతడి పెట్టారు.