నా ఆస్తులపై ఎవరికీ హక్కు లేదు : మంచు మోహన్ బాబు

నా ఆస్తులపై ఎవరికీ హక్కు లేదు : మంచు మోహన్ బాబు
  • కష్టపడి నేనే సంపాదించుకున్న
  • ఆస్తుల వివాదంపై రంగారెడ్డి కలెక్టరేట్​లో విచారణకు హాజరు
  • తన వాదనలనూ వినిపించిన మంచు మనోజ్
  • ఓ పెద్ద ప్లాస్టిక్ డబ్బాలో డాక్యుమెంట్లతో హాజరు
  • మరోసారి విచారణకు పిలుస్తానన్న అడిషనల్ కలెక్టర్

రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: ఆస్తి తగాదాల విషయంలో సినీ నటుడు మంచు మోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు, మంచు మనోజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోమవారం రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రతిమా సింగ్ ఎదుట విచారణకు హాజరయ్యారు. తన ఆస్తులపై మనోజ్​కు ఎలాంటి అధికారం లేదని మోహన్​బాబు తెలిపారు. అటు మంచు మనోజ్ కూడా తనతో తీసుకొచ్చిన డాక్యుమెంట్లను అడిషనల్ కలెక్టర్​కు చూపించారు. ఇరువురు తమ వాదనలు వినిపించారు. అయితే, ముందుగా వీరితో అడిషనల్​కలెక్టర్ ప్రతిమా సింగ్ వేర్వేరుగా భేటీ అయ్యారు. అనంతరం ఇద్దరినీ ఒకేచోట కూర్చోబెట్టి సమస్యను అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ సంరక్షణ చట్టం 2007 కింద తనకు రక్షణ కల్పించాలంటూ డిసెంబర్ 17న మోహన్ బాబు రంగారెడ్డి కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. 

బాలాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలం జల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి గ్రామంలో తానుంటున్న ఇంట్లోకి మనోజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అక్రమంగా ప్రవేశించారని, ఆస్తులు కావాలంటూ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ అధికారి.. మోహన్ బాబు, మనోజ్​కు నోటీసులు జారీచేశారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. దీంతో జనవరి 18న మనోజ్ వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఆ రోజు మోహన్ బాబు తరఫున ఆయన ప్రతినిధి అటెండ్ కావడంతో విచారణకు నిరాకరించారు. 

ఫిర్యాదుదారుడే వ్యక్తిగతంగా హాజరుకావాలని సూచించారు. దీంతో సోమవారం మధ్యాహ్నం ఇద్దరూ రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ ముందు విచారణకు అటెండ్ అయ్యారు. ఆస్తుల వివరాలను ఆమె ఇద్దరినీ అడిగి తెలుసుకున్నారు. మోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాబు మాట్లాడుతూ.. తన ఆస్తులన్నీ స్వార్జితమని, వాటిపై ఎవరికీ హక్కు లేదని పేర్కొన్నారు. మనోజ్ వద్ద ఉన్న ఆస్తులను తనకు అప్పగించాల్సిందేనని చెప్పారు. జల్ పల్లిలోని ఇండ్లు, ఫిల్మ్​నగర్​లోని ఇంటి వివరాలను వెల్లడించారు. అనంతరం.. ఓ పెద్ద ప్లాస్టిక్ డబ్బాలో మనోజ్ తీసుకొచ్చిన డాక్యుమెంట్లను ప్రతిమా సింగ్​పరిశీలించారు. మంచు మనోజ్ కూడా తన వాదనను వినిపించారు. 

అనంతరం మరోసారి విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని అడిషనల్​కలెక్టర్​వారితో చెప్పారు. ముందుగా మనోజ్ కలెక్టరేట్ నుంచి వెళ్లిపోగా.. తర్వాత మోహన్ బాబు బయలుదేరారు. ఇద్దరూ కూడా మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. కాగా, తమ సమస్యలపై కలెక్టర్​కు వినతిపత్రాలు ఇద్దామని ప్రజావాణికి వచ్చిన సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విచారణ జరుగుతున్నంత సేపు కలెక్టరేట్​లోకి ఎవరినీ అనుమతించలేదు.