మంచు విష్ణు హీరోగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘జిన్నా’ మూవీ ఈ రోజు తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా విష్ణు చెప్పిన విశేషాలు.
‘‘షోలు వేసి ప్రివ్యూ చూపించాం. అందరూ విపరీతంగా ఎంజాయ్ చేశారు. ఢీ సినిమా చేసేటప్పుడు ప్రతిక్షణం నవ్వుతూనే ఉన్నాం. జనాలకీ నచ్చేసింది. ఇది ఆ రేంజ్‌లో హిట్టవుతుందో లేదో అనేది తెలీదు కానీ ఇంటర్వెల్ చూసి షాకవుతారు. ‘ఢీ’లో ఇంటర్వెల్‌కి సర్‌ప్రైజ్ ఉండదు. అదే ఈ రెండు సినిమాలకీ తేడా. హీరో నేనే అయినా చమ్మక్ చంద్ర, వెన్నెల కిషోర్ పాత్రలు నాకు ఎక్కువ నచ్చాయి. సెకెండాఫ్ కడుపుబ్బ నవ్వించేస్తాం. నాకు యాక్షన్ కామెడీ జానర్ కలిసి వచ్చింది. మధ్యలో కొన్ని ట్రై చేసి తప్పు చేశాను. దాన్ని దిద్దుకునే ప్రయ త్నమే ఈ సినిమా. నా పాత్ర పేరు జి.నాగేశ్వరరావు. జీనా అని పిలిస్తే బాగుండదు. అందుకే జిన్నా అని పెట్టాం. అప్పు చేసి టెంట్ హౌస్ పెట్టుకుంటాడు. కానీ ఏ పెళ్లికి టెంట్ వేసినా ఆ పెళ్లి ఆగిపోద్ది. మరి అప్పు ఎలా తీర్చుతాడనేది కాన్సెప్ట్. టైటిల్ విషయంలో కాంట్రవర్సీ అవుతుందని కొందరు అన్నారు. కానీ ఉద్దేశం మంచి దయినప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొందామని ఫిక్స్ చేశాం. మూల కథ జి.నాగేశ్వరరెడ్డి గారిదే. కానీ కోన వెంకట్ పూర్తిస్థాయిలో రెడీ చేశారు. సన్నీ లియోన్ డేట్స్ లాక్ చేసుకుని నా దగ్గరికి వచ్చారు. సన్నీ తెలుగులో అంత పాపులర్ కాదు కదా అనుకున్నా. కథ బాగుంది చేయమన్నారు నాన్న. సన్నీ అయితే బాగుంటుందని మీడియా ఫ్రెండ్ ఒకరు కూడా అనడంతో ఆమె ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. నా పిల్లలు ఓ పాట పాడారు. సరిగ్గా పాడకపోతే నెగిటివ్ టాక్ వస్తుందని అందరూ హెచ్చరించారు. కానీ వారిద్దరూ ట్రెయిన్డ్ సింగర్స్. బాగా పాడారు. ‘ఢీ’ సీక్వెల్ జనవరి లేదా ఫిబ్రవరిలో స్టార్టవుతుంది. మంచి కథ ఎక్కడున్నా మనవాళ్లకి చెప్పాలనే ఉద్దేశంతో చాలా సినిమాల రీమేక్ రైట్స్ కొన్నాను. వేరే హీరోలతోనూ ఆ సినిమాలు తీస్తాను. నవంబర్ చివర్లో ఈ చిత్రాల గురించి ప్రకటిస్తాను. ‘ఆండ్రాయిడ్ కుంజప్పన్’ రైట్స్ నాన్న కోసం తీసుకున్నాను. కథలోని ఆత్మను మాత్రమే తీసుకుంటాం. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్చేస్తాం. నా చేతిలో ఇంకో క్రేజీ ప్రాజెక్ట్ ఉంది. పూర్తిగా డిఫరెంట్ జానర్. కానీ అందులోనూ కామెడీ ఉంటుంది. కన్‌ఫర్మ్ అవగానే అనౌన్స్ చేస్తాను.’’