తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్లు

  • డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
  •  ఉగాదికల్లా మంచుకొండ ఎత్తిపోతల పథకం పనులు పూర్తి
  • లిఫ్ట్ పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం, మంత్రులు 

ఖమ్మం టౌన్, వెలుగు: తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగు నీరు అందిస్తామని  డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో రూ. 66.33 కోట్లతో నిర్మించనున్న మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు జిల్లా ఇంచార్జి మంత్రి  కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా  డిప్యూటీ సీఎం  మాట్లాడుతూ.. మంచుకొండ ఎత్తిపోతల పథకం పూర్తయితే 2,400 ఎకరాలకు  సాగునీరు అందుతుందన్నారు.  

ఖమ్మం జిల్లాకు ఇండస్ట్రియల్ పార్కును తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న  సింగరేణి, హెవీ వాటర్ ప్లాంట్ వంటి భారీ పరిశ్రమలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్లిపోయాయని, ఖమ్మం జిల్లా పూర్తిగా వ్యవసాయం పైనే ఆధారపడిందని, దీంతో  ఇక్కడ చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి, అవకాశాలు లేకుండా పోయాయన్నారు.  ఖమ్మంలో  వ్యవసాయాధారిత పరిశ్రమల ఏర్పాటుకు ప్లాన్​ చేస్తామన్నారు.  

సాగునీటి సౌకర్యం లేని  రఘునాథపాలెం మండలానికి   మంత్రి తుమ్మల మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేయించారని జిల్లా ఇంచార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఖమ్మం, నల్గొండ జిల్లాలో ప్రతి ఎకరానికి సాగునీటి సరఫరా చేసేందుకు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, ఆర్థిక మంత్రి జిల్లాకు చెందిన వారే కావడంవల్ల నిధులకు కొరత ఉండదన్నారు. రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, మంచుకొండ ఎత్తిపోతల పథకం ద్వారా 27 చెరువుల క్రింద 2,400 ఎకరాల ఆయకట్టుకు లబ్ధి జరుగుతుందన్నారు.

గత పాలకులు కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారామ లాంటి  భారీ ప్రాజెక్టుల క్రింద రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా నామమాత్రపు ఆయకట్టకే నీళ్లిచ్చారన్నారు.   సీతారామ ఎత్తిపోతల పథకానికి రూ.8500 కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరం కూడా  సాగులోకి రాలేదని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేడంతోపాటు  కొత్త పనులను చేపట్టి ప్రతి ఎకరానికి సాగునీరు సరఫరా చేయాలన్న సంకల్పంతో  పని చేస్తున్నామన్నారు.    

రాబోయే వానాకాలం నాటికి మంచుకొండ లిఫ్ట్ ద్వారా సాగునీరు అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జూలూరుపాడు టన్నెల్ పూర్తి చేస్తే సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలకు గోదావరి జలాలు వస్తాయని అన్నారు. మున్నేరు నదికి వరద వచ్చినప్పుడు లింక్ కెనాల్ ద్వారా పాలేరు రిజర్వాయర్ నింపే ప్రతిపాదనలు ఉత్తమ్, భట్టి విక్రమార్క వద్ద ఉన్నాయని, వాటిని వెంటనే మంజూరు చేయాలని మంత్రి తుమ్మల కోరారు. భారీ మెజార్టీతో ప్రజలు తమను గెలిపించుకున్నందుకు ఖమ్మంలో సీతారామ పూర్తి కావాలని, భద్రాద్రి దేవాలయానికి రైల్వే లైన్ రావాలని, కొత్తగూడెంలో విమానాశ్రయం, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, జాతీయ రహదారి పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని అన్నారు. 

సత్తుపల్లి ట్రంక్ పూర్తి చేయగలిగితే ఈ సంవత్సరం లక్షన్నర ఎకరాల ఆయకట్టు ఆగస్టు 15 లోగా సాగులోకి వస్తుందని, దీనికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరారు.  మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గత పాలకులు విచ్చిన్నం చేసినప్పటికీ గత సంవత్సర కాలంగా ఆర్థిక పరిస్థితిని బాగు చేసుకుంటూ కొన్ని హామీలను నెరవేర్చామని, రెండవ సంవత్సరంలో నూతన రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. ప్రజలకు సాగునీటి సరఫరా చేసే ప్రాజెక్టులపై గత పాలకులకు పట్టులేదని, ఇందిరమ్మ రాజ్యంలో రఘునాథపాలెం మండల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టామని చెప్పారు. 

ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి మాట్లాడుతూ నాలుగు సంక్షేమ పథకాలను ప్రభుత్వం జనవరి 26 నుంచి అమలు చేయబోతుందని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ బలరాంనాయక్, ఖమ్మం సీపీ సునీల్ దత్, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి, అశ్వారావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ,  మేయర్ పునుకొల్లు నీరజ, ఇర్రిగేషన్ ఎఈ వెంకటేశ్వర రావు పాల్గొన్నారు.