గురుకుల కాలేజ్ విద్యార్థి ఆత్మహత్య

మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మందమర్రి ఎస్సీ హాస్టల్ లో ఉంటున్న విద్యార్థి ప్రభాస్(19) ఆత్మహత్య చేసుకున్నాడు. డబ్బులు దొంగతనం చేశాడని మూడు రోజుల క్రితం తోటి విద్యార్థులు కొట్టడంతో మనస్థాపానికి గురైన ప్రభాస్.. స్వగ్రామానికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు మంచిర్యాల మెయిన్ రోడ్డుపై ధర్నా చేపట్టారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..

మంచిర్యాల జిల్లా వెన్నల మండలం జోగాపూర్ గ్రామానికి చెందిన ప్రభాస్.. మందమర్రి ఎస్సీ హాస్టల్ లో ఉండి డిగ్రీ చదువుకుంటున్నాడు. అయితే మూడు రోజుల క్రితం(అక్టోబర్ 2) ప్రభాస్ ఉంటున్న రూమ్ లో తోటి విద్యార్థివి డబ్బులు పోయాయి. అయితే ఆ డబ్బులు ప్రభాస్ దొంగతం చేశాడని తోటి విద్యార్థులు అతన్ని కొట్టారు. దీంతో మనస్థాపానికి గురైన ప్రభాస్.. తన సొంత గ్రామానికి వెళ్లి.. ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ప్రభాస్ ను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రభాస్ మృతి చెందాడు. దీంతో ప్రభాస్ స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ప్రభాస్ చనిపోవడానికి కారణం తోటి విద్యార్థులు, హాస్టల్ వార్డెన్ కారణమని అతని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని మంచిర్యాల మెయిన్ రోడ్డుపై కుటుంబ సభ్యులు ధర్నా చేపట్టారు.