- జిల్లావ్యాప్తంగా మోస్తరు వర్షాలు
- ఇక ముమ్మరంగా ఎవుసం పనులు
- 1.62 లక్షల ఎకరాల్లో పత్తి, 1.60 లక్షల ఎకరాల్లో వరి టార్గెట్
- ఇప్పటివరకు 50 వేల ఎకరాల్లోనే పత్తి సాగు
- జూలై 20 వరకు విత్తుకొనే చాన్స్ ఉందన్న ఆఫీసర్లు
మంచిర్యాల, వెలుగు: ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. గత నాలుగు రోజులుగా మంచిర్యాల జిల్లాలో మోస్తరు వర్షాలు పడ్డాయి. ఈ నెలాఖరు నుంచి జూలైలో భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో రైతులు ఎవుసం పనులు ముమ్మరం చేస్తున్నారు. భూములు తడవడంతో పత్తి విత్తనాలు నాటుతున్నారు. బోర్లు, బావుల కింద, నీటి వసతి ఉన్న రైతులు నార్లు పోస్తున్నారు. అయితే మరో రెండు గట్టి వానలు పడేదాకా విత్తనాలు నాటేందుకు తొందరపడొద్దని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
45 వేల ఎకరాల్లోనే పత్తి సాగు
ఈ ఏడాది వానాకాలం సీజన్లో 1.62 లక్షల ఎకరాల్లో పత్తి, 1.60 లక్షల ఎకరాల్లో వరి పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. 3.78 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరం కాగా, 4.05 లక్షలు అందుబాటులో ఉంచారు. ఈ నెలలో తొలకరి జల్లులు కురవడంతోనే కొంతమంది రైతులు విత్తనాలు పెట్టారు. ఆ తర్వాత వానలు లేకపోవడంతో విత్తనాలు మొలకెత్తని చోట మళ్లీ నాటుతున్నారు.
ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 50 ఎకరాల్లో మాత్రమే పత్తి సాగైనట్లు అధికారులు పేర్కొన్నారు. జూలై 20 వరకు పత్తి సాగుకు చాన్స్ఉందని తెలిపారు. వరి సాధారణ సాగు విస్తీర్ణం 1.60 లక్షల ఎకరాలుగా అంచనా వేశారు. ఇప్పటివరకు భారీ వర్షాలు పడకపోవడంతో బోర్లు, బావులు కింద నీటి వసతి ఉన్న రైతులు వరినార్లు పోస్తున్నారు. ఇప్పటివరకు 30 ఎకరాల్లో మాత్రమే నారుమడులు చేసినట్టు తెలిపారు.
52 శాతం లోటు వర్షపాతం
జిల్లాలో ఈ నెల 24 వరకు సాధారణ వర్షపాతం 125.4 మిల్లీమీటర్లు కాగా, ఇప్పటివరకు 59.8 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. ఇంకా 52 శాతం లోటు నెలకొంది. జిల్లాలోని 18 మండలాలకు గాను ఒక్క కాసిపేటలో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. మిగిలిన 17 మండలాల్లో లోటు నెలకొంది. ఇప్పటివరకు అత్యధికంగా కాసిపేటలో 97.7 మిల్లీమీటర్లు, బెల్లంపల్లిలో 94.7 మిల్లీమీటర్ల వర్షం కురువగా, భీమినిలో అత్యల్పంగా 20.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ నెలాఖరు నుంచి జూలైలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొనడంతో రైతులు మొగులు దిక్కు చూస్తున్నారు.