అధికారిక లాంఛనాలతో మందా జగన్నాథం అంత్యక్రియలు

దిల్‌‌సుఖ్‌‌నగర్, వెలుగు: నాగర్‌‌‌‌ కర్నూల్‌‌ మాజీ ఎంపీ మందా జగన్నాథం అంత్యక్రియలు ముగిశాయి. సోమవారం సైదాబాద్‌‌ ధోబి ఘాట్‌‌లోని హిందూ శ్మశనవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో రాష్ట్ర సర్కార్‌‌‌‌ ఆయన అంత్యక్రియలను నిర్వహించింది. మందా జగన్నాథం పార్థివ దేహానికి మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, సానుభూతిని తెలిపారు. అనంతరం జగన్నాథం పాడె మోశారు. 

మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, మాజీ ఎంపీ రాములు, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తదితరులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మధుయాష్కీ మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా తనకు జగన్నాథం ఎంతో ఆత్మీయుడన్నారు. ఆయనతో కలిసి ఎంపీగా పని చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను పార్టీ అధిష్టానానికి తీసుకెళ్లి ఒత్తిడి చేశారన్నారు. రాష్ట్ర ఏర్పాటు, ప్రజల ఆకాంక్షల కోసం తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి పోరాడారని వివరించారు. 

పాలమూరు రాజకీయాల్లో జగన్నాథం చెరగని ముద్ర: కేటీఆర్

పాలమూరు జిల్లా రాజకీయాల్లో మాజీ ఎంపీ మందా జగన్నాథం చెరగని ముద్ర వేశారని బీఆర్‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌‌‌ అన్నారు. సోమవారం చంపాపేటలో మందా జగన్నాథం పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి బీఆర్‌‌‌‌ఎస్‌‌ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. కేటీఆర్‌‌‌‌ మాట్లాడుతూ.. మంద జగన్నాథం మరణంతో తెలంగాణ ఒక సీనియర్ రాజకీయవేత్తను కోల్పోయిందన్నారు.