అంతిమ లక్ష్యం వర్గీకరణే : మందకృష్ణ మాదిగ

అంతిమ లక్ష్యం వర్గీకరణే : మందకృష్ణ మాదిగ
  •     మాదిగల ఆత్మీయ సమ్మేళనంలో మందకృష్ణ

ఇబ్రహీంపట్నం, వెలుగు : ఎస్సీ వర్గీకరణ సాధించడమే తన అంతిమ లక్ష్యమని, వర్గీకరణ కోసం రాజకీయ పదవులు వదులుకున్నానని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చెప్పారు. మరో మూడు నెలలు ఉద్యమిస్తే వంద తరాలకు భవిష్యత్​ను ఇచ్చినవారము అవుతామని పిలుపునిచ్చారు. ఏబీసీడీ వర్గీకరణకు చివరి ఘట్టం ఆరంభమైందని చెప్పారు. ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం నిర్వహించిన మాదిగల ఆత్మీయ సమ్మేళనంలో మందకృష్ణ మాదిగ, ప్రొఫెసర్ ఖాసీం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ.. కమిషన్ రిపోర్టు ఆధారంగా వర్గీకరణకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేయకపోతే ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతుందని, పిల్లాపాపలతో అంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. డప్పులను సిద్ధంగా పెట్టుకోవాలన్నారు. ప్రొఫెసర్ ఖాసీం మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అనంతరం మాల, మాదిగలు ఒక్కటిగా హక్కులు సాధించుకోవాలన్నారు.

భూమి, రాజ్యాధికారం కోసం కలిసికట్టుగా ఉద్యమించాలని కోరారు. నాయకులు బోసపల్లి ప్రతాప్, కొండ్రు ప్రవీణ్, నరేశ్, ఇందిర, కృపేశ్, భరత్​, మంద సురేశ్, ఆకారం కృష్ణ, కంబాలపల్లి భాస్కర్, కృష్ణ, అయోధ్య తదితరులు పాల్గొన్నారు.