పద్మారావునగర్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ చట్టం తెచ్చేవరకు గ్రూప్ పరీక్షలన్నీ వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. త్వరలో జరగబోయే గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలతో పాటు గ్రూప్-4 ఫలితాలను ఆపాలని, ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయి, అమల్లోకి వచ్చాక తిరిగి గ్రూప్స్పరీక్షలు నిర్వహించాలన్నారు.
గురువారం పార్శీగుట్టలోని ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి మాదిగలను మభ్య పెడుతున్నారని, ఇన్నాళ్లు ఆయనను నమ్మి మాదిగ జాతి మోసపోయిందని, ఇక నుంచి నమ్మే పరిస్థితి లేదన్నారు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో సీఎం చెప్పిన మాటలకు విలువ లేకుండా పోయిందన్నారు. ఎస్సీ వర్గీకరణ చట్టం చేయకముందే టీచర్ పోస్టుల నియామకాలను పూర్తి చేశారని ఆయన మండిపడ్డారు.