కడియం మాదిగ కాదు.. బైండ్ల కులస్తుడు : మందకృష్ణ మాదిగ

బీఆర్ఎస్ ఎమ్మెల్యే  కడియం శ్రీహరిపై మందకృష్ణ మాదిగ తీవ్రస్థాయిలో మంండిపడ్డారు. కడియం శ్రీహరి మాదిగల ఎదుగుదలను అడుగడుగునా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.  మాదిగల ఎదుగుదలను కడియం జీర్ణించుకోలేక పోతున్నారన్నారని చెప్పారు .  40 ఏళ్లుగా తాను మాదిగనని నమ్మిస్తూ కడియం రాజకీయ లబ్ది పొందుతున్నారని ఆరోపణలు చేశారు.  కడియం బైండ్ల కులస్థుడు కానీ మాదిగ కులాన్ని అడ్డం పెట్టుకొని ఎదిగాడన్నారు. డిప్యూటీ సీఎం స్థాయి వరకు ఎదిగిన  కడియం... తన వల్ల  ఎదిగిన మరో మాదిగ ఎవరో చూపించాలన్నారు.  

ఎవరి పోత్సాహం లేకుండా ఎదిగిన తాటికొండ రాజయ్య , ఆరూరి రమేష్, ఎంపీ పసునూరి దయాకర్ లను అనగతొక్కింది కూడా కడియం శ్రీహరేనని  మందకృష్ణ మాదిగ ఆరోపించారు.  డిప్యూటీ సీఎంగా ఉన్న రాజయ్యను ఆరునెలలు తిరగకముందే కడియం తొక్కేశారన్నారు. వరంగల్ ఎంపీగా ఉండి ఉప ముఖ్యమంత్రి పదవి పైన కడియం  కన్నేశారన్నారు.  గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజయ్యకు ఎమ్మెల్యే టిక్కెట్ రాకుండా చేసి ఆ టిక్కెట్ కూడా కడియం తీసుకున్నాడని చెప్పారు.  ఆరూరి ఓటమికి కూడా కడియమే కారణమన్నారు.  మాదిగల పేరు చెప్పుకొని దళిత వర్గాల నుండి ఆధిపత్యం చెలాయిస్తున్న నాయకుడు కడియం శ్రీహరి అని మందకృష్ణ మండిపడ్డారు.