అనాథలకు ఇచ్చిన హామీ అమలు చేయాలి :మంద కృష్ణ మాదిగ

సూర్యాపేట, తుంగతుర్తి, మిర్యాలగూడ, వెలుగు: అనాథ పిల్లలకు ప్రత్యేక గురుకులాలు ఏర్పాటు చేసి రిజర్వేషన్లు అమలుతో పాటు స్మార్ట్ కార్డులు ఇస్తామన్న హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్యాలయంతో పాటు తిరుమలగిరి, దామచర్ల మండల కేంద్రాల్లో ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్పీ ఆధ్వర్యంలో అనాథల అరిగోస దీక్ష నిర్వహించారు. సూర్యాపేటలో పాల్గొన్న మందకృష్ణ మాట్లాడుతూ అనాథలకు ప్రభుత్వమే తల్లితండ్రిలా ఉంటుందని హామీ ఇచ్చిన కేసీఆర్‌‌ మాట తప్పారని మండిపడ్డారు. 

అనాథల కోసం మూడు దఫాలుగా నిర్వహిస్తున్న ఉద్యామానికి ప్రతిపక్షాలు మద్దతుగా నిలవాలని కోరారు. కేసీఆర్‌‌ రాజకీయ , ప్రభుత్వ పదవుల్లో మాదిగలకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని వాపోయారు. మందుల సామెల్ బీఆర్‌‌ఎస్‌ నుంచి బయటకు రావడాన్ని ఆయన స్వాగతించారు. ఆయా కార్యక్రమాల్లో నేతలు ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నేతలు కందుకూరి సోమన్న, మచ్చ కొండలు, యతకుల రాజన్న,  వీరస్వామి, వెంకన్న, మల్లేశ్, నాగేశ్వరి, కరుణాకర్  తదితరులు పాల్గొన్నారు.