- సూర్యాపేటలో కృష్ణది కుల దురహంకార హత్య
- ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుచేసి నిందితులను కఠినంగా
- శిక్షించాలని డిమాండ్
సూర్యాపేట, వెలుగు: దళితుల్లో ఏ వర్గానికి వ్యతిరేకంగా తాను మాట్లాడలేదని, కేవలం పబ్లిసిటీ కోసమే మందకృష్ణ మాదిగ లేని పోనీ ఆరోపణలు చేస్తున్నారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. వివేక్ వెంకటస్వామి కుటుంబం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక శక్తులను పరోక్షంగా వెనకుండి నడిపించిందనే మందకృష్ణ ఆరోపణలపై వివేక్ ఘాటుగా స్పందించారు.
మాల, మాదిగలది పొలిటికల్ గొడవని, మంద కృష్ణ మాదిగ వెనకాల ఏ పార్టీ ఉందో అందరికీ తెలుసని, వాళ్లు ఆడిస్తున్నట్టు ఆయన ఆడుతున్నారని విమర్శించారు. తమ నాన్న కాకా వెంకటస్వామి, తాను దళితుల ఐక్యత కోసమే పనిచేశామని స్పష్టం చేశారు. ప్రజల్లో ఆదరణ లేని మంద కృష్ణ మాదిగ మూడుసార్లు ఎన్నికల్లో పోటీచేసినా డిపాజిట్ కూడా దక్కలేదని విమర్శించారు. కుటుంబంలో ముగ్గురికి పదవులంటూ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ‘‘సుప్రీంకోర్టు తీర్పుతో ఏ వర్గానికి ఎన్ని ఉద్యోగాలొచ్చాయి.
రిజర్వేషన్ ఆధారంగా విద్యాసంస్థల్లో ఎవరు ఎన్ని సీట్లు పొందారు. ఏ వర్గానికి ఎంత లబ్ధి కలిగిందో సాంకేతిక పరిశోధన జరిగాక నిజంగా నష్టపోయిన వర్గానికి లబ్ధి చేకూర్చాలని తీర్పులో ఉంది” అని.. తాము అదే చేయమని అడుగుతున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణ అడ్డుకుంటున్నట్లు తనపై మందకృష్ణ మాదిగ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆధారాలతో నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటామని సవాల్ విసిరారు. తెలంగాణలో జనాభా పరంగా రెండో స్థానంలో ఉన్న మాలలను చిన్న చూపు చూస్తున్నారనే.. సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం పోరాటం చేస్తున్నామే తప్ప ఎస్సీ రిజర్వేషన్ అడ్డుకోవడం కోసం కాదన్నారు.
మాల సింహా గర్జనలో ఈ విషయం చెప్పమన్నారు. మాల హక్కుల కోసం, జాతిని కాపాడుకోవాలనే సింహా గర్జన నిర్వహించినట్లు తెలిపారు. రెడ్లు, కమ్మలు, ఇతర కులాలు మీటింగ్ పెడితే మంద కృష్ణ ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. బీజేపీ మాల, మాదిగలను విభజించి పాలించాలని కుట్ర చేస్తుందని దీంతో దళిత జాతికి తీరని నష్టం జరుగుతుందని ఆవేదన చెందారు. జనాభా ప్రకారం కుల గణన చేసి రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. దళితులు ఐక్యంగా ఉండి హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
ఎస్సీ, ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తం: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
కృష్ణ హత్య దారుణమని.. దీన్ని నేషనల్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని కె.ఆర్. నాగరాజు అన్నారు. ఇంత దారుణమైన హత్య జరిగినా అధికారులు స్పందించకపోవడం శోచనీయమన్నారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తామని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులకు కఠినంగా శిక్ష పడేలా పోరాటం చేస్తామన్నారు. అంతకుముందు సూర్యాపేటలో కృష్ణ ఇంటికి మాల మహానాడు కార్యకార్తలతో కలిసి వివేక్ వెంకట స్వామి భారీ ర్యాలీగా తరలివెళ్లారు.
కార్యక్రమంలో మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అద్యక్షుడు తల్లమళ్ల హుస్సేన్, మాల మహానాడు జిల్లా అద్యక్షుడు విర్జాల వేణు బలరాం, గౌరవ అద్యక్షుడు బోల్లేద్దు దశరథ, ఆషాద రవి, కట్ట సైదులు, కట్ట మురళి, అఖిల్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
కుల దురహంకార హత్యను ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి..
ఇంకా కుల వివక్ష ఎక్కడిది అనే వారు సూర్యాపేటలో కృష్ణ(బంటి) హత్య ఘటనను అర్థం చేసుకోవాలని.. కుల దురహంకార హత్యలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని వివేక్ వెంకటస్వామి అన్నారు. కులం పేరుతో బంటిని హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కులాంతర వివాహం నేపథ్యంలో హత్యకు గురైన కొడకొండ్ల కృష్ణ.. కుటుంబ సభ్యులను వివేక్ వెంకట స్వామి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు పరామర్శించారు. తర్వాత వివేక్మాట్లాడుతూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి హంతకులకు తక్షణమే శిక్ష పడేలా చేయాలని అన్నారు. బంటి కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి ఎక్స్ గ్రేషియా, ఒక ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలన్నారు. కుల వివక్షతో హత్యలు జరిగినప్పుడు 90-రోజుల్లోనే తీర్పు వచ్చేలా నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కోరుతామన్నారు. కృష్ణ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీతో మాట్లాడి బంటి కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని, నిందితులకు త్వరగా శిక్ష పడేలా చూడాలని కోరారు.