- తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర..
- ఎమ్మెల్యేగా సేవలు కవి, రచయిత, గాయకుడిగా ప్రత్యేక గుర్తింపు
- పలువురు ప్రముఖుల సంతాపం
- రేపు హనుమకొండలో అంత్యక్రియలు
హనుమకొండ/హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమకారుడు, బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణ రెడ్డి(86) కన్నుమూశారు. హనుమకొండలోని ఆయన నివాసంలో ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం ఇప్పగూడలో 1936 సెప్టెంబర్ 2న పుట్టిన సత్యనారాయణ రెడ్డి.. కవిగా, రచయితగా, గాయకుడిగా, ఏ విషయంపై అయినా అనర్గళంగా మాట్లాడగలిగే నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. స్కూల్ లో చదువుకుంటున్న టైమ్ లోనే తెలంగాణ ఉద్యమంతో పాటు ముల్కీ ఆందోళనల్లోనూ పాల్గొన్నారు. 1952లో వరంగల్ లో చదువుకుంటున్న టైమ్‌లో ఆర్ఎస్ఎస్లో చేరారు. స్కూల్ ఎడ్యుకేషన్ అనంతరం 1957లో భారతీయ జనసంఘ్‌లో ఫుల్‌టైమ్ ఆర్గనైజర్‌గా పని చేశారు. జనసంఘ్ ఏర్పాటైన కొత్తలో ఎన్నో కవితలు, పద్యాలు రాసి, పాడిన మొదటి వ్యక్తిగా అందరి మన్ననలు అందుకున్నారు. సత్యనారాయణ రెడ్డికి భార్య తారమ్మ, కొడుకు శ్యామ్‌సుందర్‌రెడ్డి, కూతురు రమాదేవి ఉన్నారు. హనుమకొండలోని పద్మాక్షి శివముక్తిధామ్‌లో మంగళవారం ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జనసంఘ్, బీజేపీలో ఎన్నో కీలక పదవుల్లో సత్యనారాయణ రెడ్డి పని చేశారు. ఉమ్మడి ఏపీలో జనసంఘ్ లో దాదాపు 20 ఏండ్ల పాటు ఫుల్ టైమ్ ఆర్గనైజర్ గా, ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శిగా కొనసాగారు. ఉమ్మడి ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రెండుసార్లు నియమితులయ్యారు. కిసాన్‌మోర్చా అధ్యక్షుడిగా, పార్టీ నేషనల్కౌన్సిల్ మెంబర్‌గా, రాష్ట్ర కార్యదర్శిగా పని చేశారు. ప్రజాస్వామ్యవాది అయిన సత్యనారాయణ రెడ్డి.. జమ్మూకాశ్మీర్విషయంలో జరిగిన ఎన్నో ఆందోళనల్లో పాల్గొని అరెస్ట్‌కూడా అయ్యారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి, ఎల్కే అద్వానీతో ఎన్నో బహిరంగ సభల్లో పాల్గొని తన వాక్చాతుర్యాన్ని చాటుకున్నారు. 1997 నుంచి ప్రత్యేక తెలంగాణ కోసం ఎంతగానో పోరాడారు. 2001లో టీఆర్ఎస్లో చేరి, పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ ఉద్యమం టైమ్ లో 2004లో హనుమకొండ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2012లో మళ్లీ తిరిగి బీజేపీలో చేరారు. అప్పటి నుంచి రాష్ట్ర కార్యవర్గ శాశ్వత ప్రత్యేక ఆహ్వానితులుగా పార్టీకి సేవలందిస్తున్నారు.
ప్రముఖుల సంతాపం..
సత్యనారాయణ రెడ్డి మృతికి పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. సత్యనారాయణ రెడ్డి కొడుకు శ్యామ్ సుందర్ రెడ్డికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్ ఫోన్ చేసి పరామర్శించారు. పీసీసీ చీఫ్రేవంత్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంతాపం తెలిపారు. బీజేపీ నేతలు మురళీధర్‌రావు, మార్తినేని ధర్మారావు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్‌రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ తదితరులు సత్యనారాయణ రెడ్డికి నివాళులర్పించారు.
తీరని లోటు
మందాడి సత్యనారాయణ రెడ్డి మృతి తీరని లోటు అని హర్యానా గవర్నర్ దత్తాత్రేయ అన్నారు. జాతీయ భావాలతో తాను నమ్మిన సిద్ధాంతం, రైతుల కోసం నిస్వార్థంగా పని చేశారని గుర్తు చేసుకున్నారు. సత్యనారాయణ రెడ్డి మరణ వార్త తీవ్రంగా బాధించిందని బీజేపీ ఓబీసీ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. సభల్లో పాటలు పాడి పార్టీ అభివృద్ధికి పాటుపడ్డారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మందాడి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్టు వివరించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ గుర్తు చేశారు. జన సంఘ్‌లో క్రియాశీలకంగా పని చేశారన్నారు.