
బషీర్బాగ్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ చేయడం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు ఇష్టం లేదని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, కాంగ్రెస్ నేత పిడమర్తి రవి ఆరోపించారు. మాదిగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించారు. పిడమర్తి రవి పాల్గొని మాట్లాడారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని పనిని సీఎం రేవంత్రెడ్డి చేస్తుంటే.. మందకృష్ణ అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. మాదిగలంతా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని, మందకృష్ణ మాత్రమే బీజేపీ వైపు ఉన్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన మద్దతు ఎవరికో స్పష్టం చేయాలన్నారు. మందకృష్ణకు వ్యతిరేకంగా, కాంగ్రెస్పార్టీకి మద్దతుగా సూటు.. బూటు వేసుకొని, రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ర్యాలీ నిర్వహించబోతున్నామని చెప్పారు.