- మాదిగ జేఏసీ వ్యవస్థాపకుడు పిడమర్తి రవి
బషీర్ బాగ్, వెలుగు: ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రేమ చూపిస్తూ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మందకృష్ణ మాదిగ కుట్ర చేస్తున్నారని మాదిగ జేఏసీ వ్యవస్థాపకుడు డాక్టర్ పిడమర్తి రవి ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మాదిగ జేఏసీ, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో బషీర్ బాగ్లోని బాబు జగ్జీవన్ రావు విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
అనంతరం పిడమర్తి రవి మాట్లాడుతూ.. మందకృష్ణ మాదిగకు చిత్తశుద్ధి ఉంటే లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమం ఏపీలో నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలో వర్గీకరణ చేస్తామని పలుమార్లు బహిరంగ సభల్లో ప్రకటించి, మాదిగ పక్షపాతిగా రేవంత్ రెడ్డి నిలిచారన్నారు. ఏపీతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణపై ఎలాంటి కార్యాచరణ తీసుకొని సీఎంలపై మందకృష్ణ మాదిగ వైఖరి స్పష్టం చేయాలన్నారు. ప్రజా ప్రభుత్వంపై మాత్రం లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమం చేయడం వెనక కుట్ర దాగి ఉందన్నారు.