వర్గీకరణ కోసం లక్ష డప్పులతో మహా ప్రదర్శన

వర్గీకరణ కోసం లక్ష డప్పులతో మహా ప్రదర్శన

ఖైరతాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కవులు, కళాకారులను గుర్తించి ఇంటి స్థలం, రూ.కోటి నజరానా ఇస్తామంటూ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని ఎమ్మార్పీఎస్​వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చెప్పారు. అయితే ఆ జాబితాలో మాదిగ సామాజికవర్గ కళాకారులను విస్మరించారని విమర్శించారు.  

మాదిగ కళాకారులతో గురువారం ఆయన సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రకటించిన కళాకారుల సంఖ్యను పెంచాలన్నారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని డిమాండ్​చేస్తూ జనవరి 27న  మాదిగ కళాకారులతో, -లక్ష డప్పులతో నెక్లెస్​రోడ్డులో మహా ప్రదర్శన ఉంటుందన్నారు. 

125 అడుగుల అంబేద్కర్​విగ్రహం నుంచి నెక్లెస్​రోడ్డు మీదుగా ట్యాంక్ బండ్ అంబేద్కర్​విగ్రహం కొనసాగుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన తొలిదశ ఉద్యమకారిణి టీఎన్​సదాలక్ష్మి జయంతిని అధికారికంగా నిర్వహించాలని కోరారు. సమావేశంలో ఏపూరి సోమన్న, ఓయూ విద్యార్థినేత నలిగంటి శరత్, మాదిగ కళామండలి జాతీయ అధ్యక్షుడు ఎన్.వై.అశోక్​మాదిగ, ఎమార్పీఎస్​రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేశ్​మాదిగ తదితరులు పాల్గొన్నారు.