అహంకారి కేసీఆర్‌‌కు బుద్ధి చెప్పాలి : మందకృష్ణ మాదిగ

యాదగిరిగుట్ట, వెలుగు: అహంకారంతో విర్రవీగుతున్న సీఎం కేసీఆర్‌‌కు అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు.  సోమవారం ఆలేరు బీజేపీ అభ్యర్థి పడాల శ్రీనివాస్ కు మద్దతుగా యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌‌ను దళిత సీఎం, మూడెకరాల భూపంపిణీ ఏమైందని ప్రశ్నించినందుకు తనను జైలులో పెట్టించారని మండిపడ్డారు.

ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్,  బీఆర్ఎస్‌ను ఓడించాలని కోరారు. వర్గీకరణ చేస్తామని మాటిచ్చిన ప్రధాని నరేంద్రమోదీకి అండగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని ప్రకటించారని, మోదీకి బీసీలు కూడా పార్టీకలతీతంగా మద్దతివ్వాలని కోరారు.  67 ఏళ్ల ఉమ్మడి ఏపీ, పదేళ్ల తెలంగాణలో ఇప్పటివరకు బీసీ వ్యక్తి సీఎం కాలేదని, ఈ సారి ఆ అవకాశాన్ని వదులుకోవద్దని పిలుపునిచ్చారు.  

ఆలేరులో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీసీ బిడ్డ పడాల శ్రీనివాస్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకుడు గుంటుపల్లి సత్యం, ఎమ్మార్పీఎస్ జాతీయ పొలిట్ బ్యూరో సభ్యులు మంద శంకర్, జిల్లా ఇన్‌చార్జి నల్ల చంద్రస్వామి,  నేతలు బూడిద జానీ,  తాటికాయల నరేందర్,  సుంచు ప్రేమ్,  ఎర్రగుంట ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.