దళితబంధులో అవినీతి పెరిగిపోయింది.. భూస్వాముల కోసమే రైతుబంధు : మందకృష్ణ మాదిగ

దళితబంధు పథకంలో అవినీతి పెరిగిపోయిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. కరీంనగర్​లో నిర్వహించిన ప్రెస్​ మీట్​ లో ఆయన మాట్లాడుతూ..  సీఎం కేసీఆర్​ అధికారంలోకి వచ్చి 9 ఏళ్లు అవుతున్నా.. ఎన్నికలలో ఇచ్చిన చాలా హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదని, దశాబ్ది ఉత్సవాలు నిర్వహించే నైతిక హక్కు సీఎం కు లేదన్నారు. పథకాలలో అవినీతి గురించి స్వయాన ముఖ్యమంత్రే ప్రజాప్రతినిధులను హెచ్చరించడం అవినీతి తీవ్రతను తెలియజేస్తోందని అన్నారు.

Also Read:కాంగ్రెస్‌‌కు ఓటేస్తే కష్టాలు తెచ్చుకున్నట్లే

అనాథలను విస్మరించిన కేసీఆర్​

అనాథ పిల్లలను ఆదుకుంటామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్​ ఆ ఊసే ఎత్తట్లేదని విమర్శించారు. వారి కోసం యాదగిరిగుట్టలో రెసిడెన్షియల్​ స్కూల్​తో పాటు గురుకులాన్ని ప్రారంభిస్తామని చెప్పి మర్చిపోయారన్నారు. అనాథలకు అన్నం పెట్టలేని ప్రభుత్వం వందల కోట్లతో ఉత్సవాలు చేస్తోందన్నారు.  కులధ్రువీకరణ పత్రాలు, స్మార్ట్​ కార్డు లు ఇస్తామని గతంలో సీఎం చెప్పిన హామీలను మందకృష్ణ గుర్తు చేశారు. 

అనాథ పిల్లలకు సీఎం ఇచ్చిన హామీలకు జూన్​ 23 నాటికి 8 ఏళ్లు అవుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. అనాథలకు  ఓట్లు వేసే తల్లితండ్రులు ఉండరు కాబట్టే ప్రభుత్వం వారిని పట్టించుకోవట్లేదని విమర్శించారు.