హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్రంలో అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కోరారు.ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిసి, వినతి పత్రాన్ని అందజేశారు. కోర్టు ఇచ్చిన తీర్పుతో 30 ఏళ్ల నుంచి పోరాటం సాకారం అయిందన్నారు. రాష్ట్రంలో విద్యా, ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని సీఎంను కోరారు.
మందకృష్ణతో పాటు ముఖ్యమంత్రిని కలిసిన మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలె యాదయ్య, లక్ష్మీకాంతారావు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు,మాజీ ఎంపీ పసునూరి దయాకర్, తదితరులు ఉన్నారు.