పెద్దపల్లి, వెలుగు: రాష్ట్రంలో కొత్త మండలాలు ఏర్పాటై ఆరేళ్లవుతున్నా వాటికి సొంత ఆఫీసు భవనాలు ఇప్పటికీ లేవు. కొన్నింటికి శంకుస్థాపనలు చేసి వదిలేశారు. మిగతా వాటికి ఇంకా జాగలే దొరకలేవు. అద్దె భవనాలు, గోడౌన్లలో ఊరికి దూరంగా ఆఫీసులు ఏర్పాటు చేసుకొని పాలన కొనసాగిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 9 కొత్త మండలాలు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లాలో అంతర్గాం, పాలకుర్తి, రామగిరి, కరీంనగర్లో గన్నేరువరం, ఇల్లంతకుంట, సిరిసిల్లలో వీర్నపల్లి, జగిత్యాలలో జగిత్యాల రూరల్, బుగ్గారం, బీర్పూర్ మండలాలు ఏర్పడ్డాయి.
ఈ మండల కేంద్రాల్లో మండల ఆఫీసులు, పోలీస్ స్టేషన్లు, ఎంపీడీఓ, ఎంఈఓ ఇతర ఆఫీసులన్నీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. రామగిరిలో పోలీసుస్టేషన్ నిర్మాణానికి 2017లో అప్పటి హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి భూమి పూజ చేశారు. కానీ ఇప్పటివరకు దాని నిర్మాణం పూర్తి కాలేదు. ఆ స్థలాన్ని ప్రస్తుతం హరితహారం కింద మొక్కలు పెంచడానికి కేటాయించినట్లు తెలుస్తోంది. కొన్ని ఆఫీసులకు శంకుస్థాపన జరిగినా అక్కడ ఇంకా పనులు ప్రారంభం కాలేదు.
పట్టింపు లేదు...
మండలాలు ఏర్పాటు చేసిన టైంలో ఆఫీసులు కడతామని చెప్పిన ప్రభుత్వం వాటి గురించి మరిచిపోయింది. ఆఫీసులన్నీ అరకొర సౌకర్యాల నడుమ అద్దె భవనాల్లో, మిల్లులు, గోడౌన్లలో నడుస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండల తహసీల్దార్ ఆఫీస్ రైస్ మిల్లులో ఏర్పాటు చేశారు. ఎంపీడీఓ ఆఫీస్ జడ్పీ హైస్కూల్ ఆవరణలో ఉంది. సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి మండల తహసీల్దార్ ఆఫీస్ సర్కార్ స్కూల్ ఆవరణలో రన్ చేస్తున్నారు.
శిథిలమైన ఓ అద్దె భవనంలో గన్నేరువరం తహసీల్దార్ ఆఫీసు ఉంది. రామగిరి మండలంలోని పోలీసుస్టేషన్, తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓ, ఏవో ఆఫీసులన్నీ సింగరేణి క్వార్టర్లలో నిర్వహిస్తున్నారు. సింగరేణి కార్మికుల కోసం నిర్మించిన క్వార్టర్లలో ఆఫీసులు ఏర్పాటు చేయడం పట్ల కార్మికుల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక కుటుంబానికి మాత్రమే నివాస యోగ్యమైన క్వార్టర్లలో ఆఫీసులు ఏర్పాటు చేయడంతో అవసరాల కోసం వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే కొత్త మండలాలకు అవసరమైన బిల్డింగులను నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
పనుల మీద వచ్చే వారికి కష్టం...
మండలాఫీసుకు వయసుతో నిమిత్తం లేకుండా ఏదో పని మీద రావాల్సిందే. అయితే పాత బిల్డింగులు ఉంటే ఎక్కడ ఉంటే అక్కడ ఆఫీసులు ఏర్పాటు చేసుకోవడంతో దూరం పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాలకుర్తి తహసీల్దార్ ఆఫీసు ఊరికి దూరంగా ఓ రైసు మిల్లులో ఏర్పాటు చేశారు. అక్కడకు వెళ్లినా సరైన సౌకర్యాలు కనిపించవు.
రామగిరి లో సింగరేణి క్వార్టర్ కావడంతో ఇరుకుగా ఉంది. పనులపై వచ్చే వారిని అధికారులు బయటనే ఉండమని చెబుతున్నారు. బయట చెట్లు కూడా లేకపోవడంతో వచ్చిన వారు హోటళ్లు, దుకాణాల ముందు నిరీక్షించాల్సి వస్తోంది. మండల ఆఫీసులకు శాశ్వత భవనాలు ఏర్పాటు చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఆఫీసుల కాడ తిప్పలు
తహసీల్దార్ ఆఫీసు ఊరికి దూరంగా ఉన్న రైస్ మిల్లులో ఏర్పాటు చేశారు. పనుల మీద వెళుతున్న ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మంచినీళ్లు, టాయిలెట్లు లేవు. ప్రభుత్వం వెంటనే అన్ని సౌకర్యాలతో పక్కా బిల్డింగులను నిర్మించాలి. - తొగరి తిరుపతి, పాలకుర్తి మండలం