మాలలపై విషం చిమ్మడం మానుకోవాలి .. మందకృష్ణపై మందాల భాస్కర్ ఫైర్​

ఓయూ, వెలుగు: మాలల సింహగర్జన సభ సక్సెస్ కావడాన్ని తట్టుకోలేక మందకృష్ణ మాదిగ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని భీమ్ మిషన్ ఆఫ్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ మందాల భాస్కర్ మండిపడ్డారు. మాలల మీద విషం చిమ్మడం మానుకోవాలని హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో భీమ్ మిషన్ ఆఫ్ ఇండియా, ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్, తెలంగాణ మాల విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మందాల భాస్కర్, అంసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ మంచాల లింగస్వామి  మాట్లాడుతూ.. మందకృష్ణ భాష మాలలను రెచ్చగొట్టేలా ఉందన్నారు.

 ఉద్యమం పేరుతో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ బీఆర్ఎస్ పార్టీలతో, దళిత వ్యతిరేక నాయకులతో కుమ్మక్కై దళితుల్లో ఐక్యతను దెబ్బతీస్తున్నాడని మండిపడ్డారు. రాజ్యాంగ బద్దంగా వర్గీకరణ చేస్తే మాలలు వ్యతిరేకించబోరని తెలిపారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం మాదిగ జాతికి ద్రోహం చేస్తున్నాడని ఆరోపించారు. 58 దళిత కులాలు తన వెంట ఉన్నాయని చెప్పుకుంటున్న మందకృష్ణ గత ఎన్నికల్లో మాదిగ ఉపకులమైన బైండ్లకు చెందిన కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యకు టికెట్ ఇస్తే ఆమెకు వ్యతిరేకంగా పనిచేశారన్నారు. 

మాల జాతి మీద, మాల నాయకుల మీద, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. వారితో అంసా ఓయూ అధ్యక్షుడు నామ సైదులు, తెలంగాణ మాల విద్యార్థి  జేఏసీ నాయకులు వీరస్వామి, మాదాసు రాహుల్, పండుగ భానుతేజ, గడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.