సింగరేణి మందమర్రి ఏరియా మనుగడపై నీలినీడలు

  • యాజమాన్యం తీరుపై కార్మికుల ఆగ్రహం
  • 1,300 మంది ఎంప్లాయీస్​కు బదిలీ గండం

మందమర్రి, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కాసిపేట-2 గనిని ప్రైవేటు పరం చేసే దిశగా సింగరేణి యాజమాన్యం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. నేరుగా గనిలోని అండర్​గ్రౌండ్​లో బొగ్గు ఉత్పత్తి పనులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నష్టాల సాకు చూపుతూ బొగ్గు నిల్వలున్న ఆర్కే-1ఏ గనిని మూసివేస్తుండటంతో వందలాది పర్మినెంట్​ఎంప్లాయీస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మందమర్రిలో  నడుస్తున్న పాత గనులు ఒక్కొక్కటిగా మూతపడుతుండటంతో  ఏరియా మనుగడపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మందమర్రి ఏరియా కాసీపేట 2 గనిలో బొగ్గు ఉత్పత్తి పనులను నేరుగా ప్రైవేటు కాంట్రాక్టర్​కు అప్పగిస్తూ సింగరేణి యాజమాన్యం తీసుకున్న నిర్ణయం కార్మికవర్గాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఇన్నాళ్లు సింగరేణిలో అండర్​గ్రౌండ్​బొగ్గు గనుల్లో ఉత్పత్తి పనులను నేరుగా సింగరేణి సంస్థ పర్మినెంట్​కార్మికులు, మెషినరీతో చేపట్టింది. తాజాగా కాసిపేట 2 గనిలో అండర్​ గ్రౌండ్​ పనులను ప్రైవేటు కాంట్రాక్టర్​కు అప్పగిస్తూ ప్రైవేటీకరణకు చాన్స్​ కల్పించింది.  గనిలోని నార్త్​సైడ్​ డిస్ట్రిక్ట్​(పనిస్థలం)లో బొగ్గు వెలికితీత పనులను ప్రైవేటు కాంట్రాక్ట్​కు ఇవ్వాలని సింగరేణి యాజమాన్యం టెండర్ ​ఆహ్వానించింది. మహారాష్ట్రకు చెందిన కాంట్రాక్టర్​బొగ్గు వెలికితీత పనులను దక్కించుకున్నాడు. రెండు ఎస్డీఎల్​ మెషీన్ల సాయంతో బొగ్గు ఉత్పత్తి చేపట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే గని ఆవరణలో ప్రైవేటు కాంట్రాక్టర్ ​కంపెనీకి అవసరమైన షెడ్ల నిర్మాణం జరుగుతోంది.  వెలికితీసిన బొగ్గుకు టన్ను లెక్కన కాంట్రాక్టర్​కు సింగరేణి యాజమాన్యం డబ్బులు చెల్లించనుంది. గనిలోని సౌత్​సైడ్ ​కొద్దిభాగంలో సింగరేణి యాజమాన్యం పర్మినెంట్​ కార్మికులతో బొగ్గు వెలికితీత పనులు కొనసాగించనుంది. 

ఐదేండ్లకు సరిపడా బొగ్గున్నా..

మందమర్రి ఏరియాలోని ఆర్కే1ఏ గనిని అధికారికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించనప్పటికీ అందుకు సంబంధించిన పనులు జోరుగా సాగుతున్నాయి. గనిలో పని స్థలంలో లోలెవల్​సీమ్​లు ఉండటం, అక్కడి నుంచి బొగ్గును ఉత్పత్తి చేయడం ఖర్చుతో కూడుకుందని సింగరేణి  మూసివేతకు మొగ్గుచూపింది. సీమ్ ​బొగ్గు మందం కనీసం 3, 4 మీటర్ల ఉంటే గని కొనసాగింపు సాధ్యమంటూ ఆఫీసర్లు పేర్కొంటున్నారు. ఇతర గనులతో పోల్చితే టన్ను బొగ్గు వెలికితీతకు రూ.11 వేల నుంచి 14 వేల వరకు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. గని మూసివేత నిర్ణయం తీసుకున్న యాజమాన్యం జనవరి నుంచి గనిలోపల ఉన్న మెటీరియల్​బయటకు తీసుకవచ్చే పనులు ముమ్మరం చేసింది. ఈ పనులు తుదిదశకు చేరుకునేవరకు రోజుకు 300 నుంచి 500 టన్నుల బొగ్గును వెలికితీశారు. ఈ పనులు అక్టోబర్​తో ముగిశాయి. 2022–-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ గనికి బొగ్గు టార్గెట్​ఇవ్వలేదు. అయితే గనిలోని మూడవ  సీంలో కనీసం ఐదేండ్ల పాటు వెలికితీసేంత బొగ్గు నిల్వలున్నాయని, ఆఫీసర్లు హడావిడిగా గనిని మూసివేసేందుకు ఆరాటపడుతున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.  మందమర్రి ఏరియా సింగరేణి యాజమాన్యం కాసిపేట2 గని పనులు ప్రైవేటు కాంట్రాక్టర్​కు అప్పజెప్పడం, నష్టాలు వస్తాయంటూ ఆర్కే1ఏ గని మూసివేత  పనులు చేపట్టడంతో  రెండు గనుల్లోని సుమారు 1,300 మంది పర్మినెంట్​ ఎంప్లాయీస్​కు బదిలీ గండం పొంచి ఉంది. యువ కార్మికులు, సీనియర్​ ఎంప్లాయీస్​ను ఎక్కడి బదిలీ చేస్తారో తెలియని పరిస్థితి ఉంది. 

మూసివేత నిర్ణయం విరమించుకోవాలె

ఆర్కే 1ఏ గనిలోని మూడో సీమ్​ పనిస్థలంలో మరో ఐదేండ్ల పాటు వెలికి తీసేందుకు బొగ్గు నిల్వలున్నాయి. గనిని నడపకుండా సింగరేణి ఆఫీసర్లు  తప్పుడు కారణాలు చెబుతున్నారు. 
మూసివేత నిర్ణయం విరమించుకోవాలి. కాసిపేట2 గనిలో ప్రైవేటు ఎస్డీఎల్​మెషిన్ల ఏర్పాటును అడ్డుకుంటాం. - ఎండీ.అక్బర్ ​అలీ, ఏఐటీయూసీ నేత