- 17 ఏండ్లుగా ఆగిన ఇండస్ట్రీ పనులు
- గత పదేండ్లు పట్టించుకోని బీఆర్‌ఎస్ సర్కార్
- రూ. 20 లక్షలు కేటాయించిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- పార్క్ ఓపెన్ అయితే వేలాది మందికి ఉపాధి
కోల్‌బెల్ట్, వెలుగు : మంచిర్యాల జిల్లా మందమర్రిలో పదిహేడు ఏండ్లుగా అసంపూర్తిగా ఉన్న లెదర్ పార్క్ పునరుద్ధరణకు ఎట్టకేలకు అడుగులు పడుతున్నాయి. పార్క్ పునరుద్ధరణపై చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా పార్క్‌లో మిగిలిన పనులను పూర్తి చేసేందుకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి రూ. 20 లక్షల డీఎంఎఫ్‌టీ నిధులు మంజూరు చేశారు. దీంతో లెదర్ పార్క్ అసలు ప్రారంభం అవుతుందో.. లేదో తెలియక అయోమయంలో ఉన్న నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
17 ఏండ్ల కింద ఏర్పాటు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మందమర్రిలో చర్మకారులు, షెడ్యూల్డ్ కులాలకు చెందిన నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో 17 ఏండ్ల కింద మందమర్రిలో మినీ లెదర్ పార్క్ ఏర్పాటుకు అప్పటి కార్మికశాఖ మంత్రి గడ్డం వినోద్ ప్రభుత్వాన్ని ఒప్పించారు. ఇందుకోసం ఎంపీడీవో ఆఫీస్ సమీపంలోని పాలవాగు ఒడ్డున (ప్రాణహిత కాలనీ) సర్వే నంబర్ 148లోని సింగరేణి సంస్థకు చెందిన 25 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. కేంద్రం రూ. 8 కోట్లు, రాష్ట్రం రూ. 2 కోట్ల అంచనాతో లెదర్ పార్క్ ఏర్పాటుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పార్క్ నిర్మాణానికి 2007 ఫిబ్రవరి 1న మంత్రి వినోద్ శంకుస్థాపన చేశారు. రూ.10 లక్షలతో షెడ్డు, బోర్‌వెల్ ఏర్పాటు చేయగా పవర్ సప్లై కోసం రామకృష్ణాపూర్ పట్టణానికి మంజూరైన 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను లెదర్ ఇండస్ట్రీకి కేటాయించిన స్థలానికి తరలించారు. 2009 ఫిబ్రవరి 23న అప్పటి సీఎం వైఎస్.రాజశేఖర్‌రెడ్డి బిల్డింగ్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత లెదర్ పార్క్‌లో మెషినరీ ఏర్పాటుకు అప్పటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
300 మందికి ట్రైనింగ్
మందమర్రిలో ఏర్పాటు చేసిన లెదర్ పార్క్‌లో పనిచేసేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన 40 మందిని ఎంపిక చేసి వారికి ఆంధ్రప్రదేశ్ ఫుట్‌వేర్ డిజైన్ కేంద్రంలో ట్రైనింగ్ కూడా ఇప్పించారు. వీరు స్థానికంగా 45 రోజుల పాటు మరో 300 మందికి శిక్షణ ఇచ్చారు. కానీ లెదర్ పార్క్ ప్రారంభం కాకపోవడంతో ట్రైనింగ్ తీసుకున్న వారంతా ప్రస్తుతం ఇతర పనులు చేసుకుంటున్నారు.
20 వేల మందికి ఉపాధి
మందమర్రిలో లెదర్ పార్క్ ఓపెన్ అయితే స్టూడెంట్లు, పోలీసులు, సింగరేణి కార్మికులకు బూట్లు, బెల్టులు, చెప్పులు, బ్యాగ్‌లతో పాటు కీచైన్స్‌ను కూడా ఇక్కడే తయారు చేసే అవకాశం ఉంటుంది. చెప్పులు, షూ తయారీలో భాగంగా మరో 9 వరకు చిన్నా, చితక అనుబంధ పరిశ్రమలు సైతం ఏర్పడేవి. ఈ లెదర్ పార్క్ పూర్తి స్థాయిలో ఓపెన్ అయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 20 వేల మందికి ఉపాధి దొరకనుంది.
పదేండ్లు పట్టించుకోని బీఆర్‌ఎస్
మందమర్రిలోని లెదర్ ఇండస్ట్రీకి అవసరమైన నిధుల కోసం అప్పటి రాష్ట్ర మంత్రి గడ్డం వినోద్ చొరవ చూపారు. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలిచి అధికారంలోకి వచ్చింది. కానీ ఈ పార్క్‌ను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదు. అప్పటి ఎమ్మెల్యే, ఎంపీ, ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా పట్టించుకోకపోవడంతో 17 ఏండ్లుగా పార్క్ పనులు అసంపూర్తిగానే మిగిలిపోయాయి. ఆరు మినీ లెదర్ పార్క్‌లను ఏర్పాటు చేస్తామంటూ, చెన్నైలోని కేంద్ర లెదర్ పరిశోధన కేంద్రంతో అగ్రిమెంట్ చేసుకున్నామంటూ 2020 జులైలో హడావుడి చేసిన బీఆర్‌ఎస్ సర్కార్ ఆ తర్వాత దాని ఊసే ఎత్తలేదు.
ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చొరవ
అసంపూర్తిగా ఉన్న లెదర్ పార్క్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చర్యలు చేపట్టారు. స్థానిక చర్మకారులు, నిరుద్యోగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పార్క్ పునరుద్ధరణకు కృషి చేస్తానని ఎన్నికల టైంలోనే వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా పార్క్ పనులు పూర్తి చేసేందుకు ఇటీవల రూ.20 లక్షల డీఎంఎఫ్‌టీ నిధులు విడుదల చేశారు. పార్క్ స్థలం నుంచి మందమర్రి ఏరియా సింగరేణి యాజమాన్యం రోడ్డు నిర్మించడంపై చర్మకారులు, నిరుద్యోగులు, దళితసంఘాలు అభ్యంతరం చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి స్వయంగా పార్క్‌ను సందర్శించి రోడ్డు పనులు నిలిపివేయాలని సింగరేణి ఆఫీసర్లను ఆదేశించారు. సింగరేణి, రెవెన్యూ శాఖలు జాయింట్సర్వే చేపట్టి లెదర్ పార్క్‌కు సంబంధించిన 25 ఎకరాల స్థలం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లెదర్ పార్క్ చుట్టూ కాంపౌండ్ వాల్ సైతం నిర్మించాలని సూచించారు.
లెదర్ పార్క్ పునరుద్ధరణకు సీఎంను కలుస్తా
మందమర్రి లెదర్ పార్క్ పునరుద్ధరణ విషయాన్ని ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లా. కేంద్ర మాజీమంత్రి కాకా వెంకటస్వామి హయాంలో లెదర్ పార్క్‌ల ఏర్పాటుకు కృషి చేశారు. మందమర్రి పార్క్‌కు రూ.20 లక్షల డీఎంఎఫ్‌టీ ఫండ్స్ కేటాయించా. సమగ్ర కుటుంబ సర్వే తర్వాత మరోసారి సీఎంను కలిసి లెదర్‌పార్క్‌ను అందుబాటులోకి తీసుకువచ్చి, ఉపాధి కల్పించేలా చూస్తా.
– వివేక్ వెంకటస్వామి, చెన్నూరు ఎమ్మెల్యే-
పార్క్ పునరుద్ధరణతో ఉపాధి
లెదర్ పార్క్ పునరుద్ధరణతో ప్రత్యక్షంగా సుమారు నాలుగు వేల మందికి, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది. 17 ఏండ్లుగా ఎంతో ఆశతో ఉన్నాం. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చూపుతున్న చొరవతో కంపెనీ ప్రారంభం అవుతుందన్న ఆశతో ఉన్నాం.
– కొలుగూరి విజయ్‌కుమార్, మందమర్రి-