
- పెద్దసంఖ్యలో తరలిరానున్న భక్తులు
- ప్రత్యేక బస్సులు నడిపిస్తున్న ఆర్టీసీ
- రూ.2.82 కోట్లతో ఏర్పాట్లు చేసిన ఆఫీసర్లు
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: మేడారం మినీ జాతర బుధవారం (నేటి) నుంచి మొదలవనుంది. మండమెలిగె పండుగ వేళ సమ్మక్క సారలమ్మల సన్నిధి భక్తజనంతో నిండిపోనుంది. కోరిన కోర్కెలు తీర్చే అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవడానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. ఇందుకోసం రూ.2.82 కోట్లతో ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో ప్రతీ రెండేళ్లకోసారి సమ్మక్క సారలమ్మ మహాజాతర జరుగుతుంది. ఇది ముగిసిన ఏడాది తర్వాత గిరిజన సంప్రదాయం ప్రకారం మండమెలిగె పండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దీన్నే మినీ మేడారం జాతరగా భక్తులు పిలుస్తారు.
నాలుగు రోజుల పాటు..
మండమెలిగె వేళ బుధవారం మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మ దేవాలయాలను ఆదివాసీ పూజారులు శుద్ధి చేస్తారు. ఆలయాలను శుభ్రంగా కడిగి, పుట్టమట్టితో అలికి ముగ్గులతో అలంకరిస్తారు. ఊరి పొలిమేరల్లో ద్వార స్తంభాలు స్థాపించి గ్రామ నిర్బంధం చేస్తారు. గురువారం రోజున సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద పసుపు కుంకుమలతో అర్చన జరిపి పూజలు నిర్వహిస్తారు. శుక్రవారం రోజున భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం రోజున అమ్మవార్లకు ఆలయ పూజారులు పూజలు నిర్వహిస్తారు. దీంతో మండ మెలిగె పండుగ (మినీ జాతర) ఘట్టం ముగుస్తుంది.
ప్రభుత్వ ఏర్పాట్లు పూర్తి
ఈసారి మేడారం మినీ జాతరలో సుమారు 5 లక్షల మంది భక్తులు పాల్గొంటారని ప్రభుత్వం భావిస్తోంది. గద్దెలకు సమీపంలోని కళ్యాణ మండపంలో ప్రభుత్వ వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. వీటిలో 24 గంటల పాటు ఇద్దరు డాక్టర్లు, 20 మంది వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. జాతర ప్రాంగణంలో 50 సీసీటీవీ కెమెరాలను అమర్చారు. హుండీల రక్షణ కోసం 50 మంది సిబ్బందిని నియమించారు. భక్తుల సౌకర్యార్ధం మరుగుదొడ్లు, టాయిలెట్లను ఏర్పాటు చేశారు. రక్షిత తాగునీటి సరఫరా కోసం ప్రత్యేక వాటర్ ట్యాంకర్లను తిప్పనున్నారు. మేడారం జాతర పరిసర ప్రాంతాలలోని చేతిపంపులను రిపేర్ చేయించారు. భక్తుల సౌకర్యార్ధం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తుంది. హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారానికి ప్రతి 45 నిమిషాలకు ఒక బస్సు చొప్పున.. 30 ప్రత్యేక బస్సులను నడుపనున్నారు. పెద్దలకు రూ.160, పిల్లలకు రూ.90 చొప్పున టికెట్ చార్జీ తీసుకుంటున్నారు.