![బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి మాజీ మంత్రి మండవ](https://static.v6velugu.com/uploads/2023/11/89_MCLH9gw5yq.jpg)
నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర రావు ఇవాళ కాంగ్రెస్ లో చేరనున్నారు. బోధన్‌లో జరగనున్న కాంగ్రెస్ విజయ భేరి సభలో రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. గత పార్లనెంట్ ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు మండవ. అయితే బీఆర్ఆస్‌లో తగిన గౌరవం దక్కలేదని పార్టీకి గత కొంతకాలంగా దూరంగా ఉంటూ వచ్చారు.
ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమయ్యారు. నిజామాబాద్ జిల్లాలో సెటిలర్ల ఓట్లపై మండవ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సెటిలర్లు కాంగ్రెస్ వైపు చూసే అవకాశం లేకపోలేదు. సెటిలర్లకు మండవ పెద్ద దిక్కుగా వ్యవహరిస్తారన్న పేరుంది.
మండవ వెంకటేశ్వర రావు టీడీపీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి డిచ్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి 1985లో జరిగిన ఎన్నికల్లో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తరువాత 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
1995లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా, 1997లో చంద్రబాబు మంత్రివర్గంలో ఎక్సైజ్ శాఖమంత్రిగా , 1999లో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా మూడేళ్ల పాటు పని చేసి, 2002లో విద్యాశాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించారు. 2019లో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.