బీఆర్ఎస్కు షాక్..మరో ఉద్యమకారుడు రాజీనామా

ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, రాష్ట్ర  గిడ్డంగుల కార్పోరేషన్ సంస్థ మాజీ ఛైర్మన్, ఉద్యమకారుడు మందుల శామ్యూల్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. గత కొంత కాలంగా పార్టీపై అలకభూనిన మందుల శామ్యూల్..తాజాగా బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. జూన్ 29వ తేదీన తిరుమలగిరి బహిరంగ సభలో తుంగతుర్తి  నియోజకవర్గం నుంచి మూడోసారి గాదరి కిషోర్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ  మందుల శామ్యూల్..పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. 

దళితబంధు పేరుతో దగా

బీఆర్ఎస్ పార్టీలో మాదిగలకు అవమానం జరుగుతోందని మందుల శామ్యూల్ ఆరోపించారు. కేబినెట్ లో మాదిగలకు చోటు ఇవ్వకుండా సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని నడుతున్నాడని మండిపడ్డారు. దళిత బంధు పేరుతో సీఎం కేసీఆర్ దగా చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటి వరకు ఎంత మందికి దళితబంధు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాదిగల ఆత్మగౌరవం దెబ్బతింటోందని మండిపడ్డారు. తెలంగాణ వచ్చినా..మాదిగల జీవితాల్లో మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రగతిభవన్ లో మాదిగలు అడుగుపెట్టే అవకాశమే లేదన్నారు. 

ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటా..

మాదిగల సమస్యలు చెప్పుకునే అవకాశం లేదని మందుల శామ్యూల్ ఆవేదన వ్యక్తం చేశారు. గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా తాను కట్టిన గిడ్డంగుల ప్రారంభోత్సవానికి కనీసం పిలవలేదన్నారు. మాదిగల వ్యతిరేకు కు చావుడబ్బు కొట్టాలని పిలుపునిచ్చారు. మాదిగలు మెజారిటీ ఉన్న ప్రాంతాల్లో కూడా మాదిగలకు గుర్తింపు లేదన్నారు. ఎవరు జెండా మోయని నాడు తాను జెండా మోసి పార్టీని నిలబెట్టానన్నారు. తుంగతుర్తిలో తనకు పోటీగా వలస మాలను నిలబెట్టారని మండిపడ్డారు. రాష్ట్ర కార్యదర్శినైన తనకే గుర్తింపు లేదని.. అందుకే రాజీనామా చేస్తున్నాని చెప్పారు. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటా అని స్పష్టం చేశారు. ఆత్మగౌరవం కోసం మాదిగలు పోరాడాలని పిలుపునిచ్చారు.  అవమానించే పార్టీలకు జైకొట్టొద్దని...మాదిగలకు చేస్తున్న అవమానాలకు నిరసనగా రాజీనామా చేస్తున్నానని చెప్పారు. కొద్ది రోజుల్లో చర్చించి భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని....కచ్చితంగా తుంగతుర్తి అసెంబ్లీ బరిలో ఉంటానని మందుల శామ్యూల్ తెలిపారు.