మోడీ తల ఎత్తుకునేలా పరిపాలన చేస్తున్నారు : సుమలత

మోడీ తల ఎత్తుకునేలా పరిపాలన చేస్తున్నారు : సుమలత

గతకొద్దిరోజులుగా వినిపిస్తోన్న ఊహాగానాలకు మండ్యా ఎంపీ సుమలత తెరదింపారు. తాను బీజేపీకి  మద్దతు ఇస్తున్నట్లుగా తెలిపారు.  చాముండేశ్వరి నగరలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడిన ఆమె ఈరోజు నుంచి తాను బీజేపీకి, మోడీ నాయకత్వానికి మద్దతిస్తానని ప్రకటించారు. మాండ్యాను అభివృద్ధి చేయడంలో బీజేపీ మద్దతు ఇస్తుందన్న నమ్మకంతోనే తాను  బీజేపీకి మద్దతు ఇస్తున్నానని తెలిపారు.  మాండ్యా ప్రజలు, తన శ్రేయోభిలాషులను సంప్రదించిన తర్వాతే బీజేపీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాని సుమలత వెల్లడించారు. మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతోందని ప్రతి భారతీయుడు తల ఎత్తుకునేలా ఆయన పరిపాలన చేస్తున్నారని సుమలత వ్యాఖ్యానించారు.  

ఇక బీజేపీలో చేరడంపై స్పందించిన సుమలత తాను ఇప్పుడే బీజేపీలో చేరటం లేదని దానికి ఇంకా సమయం ఉందన్నారు. ప్రస్తుతం తాను తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సిన పరిస్థితులు రావొచ్చని అన్నారు. మళ్లీ ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం తనకు లేదని, దీనివల్ల ప్రజాధనం వృధా అవుతుందని చెప్పారు. అందుకే- సరైన సమయంలో బీజేపీలో చేరుతానని స్పష్టం చేశారు. ఇక తన కుమారుడు అభిషేక్ అంబరీష్ రాజకీయాల్లోకి రాడని, సినిమాల్లోనే కెరీర్‌ను కొనసాగిస్తాడని సుమలత తెలిపారు. కాగా మండ్యా  పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరు జెడి(ఎస్) పార్టీకి సంబంధించిన  ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.