తిమ్మాపూర్, వెలుగు : కరీంనగర్ పరిధిలోని దిగువ మానేరు జలాశయం పరవళ్లు తొక్కుతోంది. శుక్రవారం 16 గేట్లు ఓ ఫీట్ మేర ఎత్తి 32,296 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎల్ఎండి పూర్తిస్థాయి నీటిమట్టం 24.034 టీఎంసీలు కాగా 21. 752 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మోయ తుమ్మెద వాగు నుంచి 32,296 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్ లోకి వస్తుంది. గేట్లు ఎత్తడంతో కరీంనగర్సిటీతోపాటు చుట్టుపక్కల నుంచి సందర్శకులు తరలివస్తున్నారు. విద్యాసంస్థలకు కూడా సెలవులు ఉండడంతో యువత, విద్యార్థులు రిజర్వాయర్‌ను చూసేందుకు భారీగా తరలివచ్చారు.
మిడ్మానేరు నుంచి నీటి విడుదల బంద్
బోయినిపల్లి, వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మిడ్ మానేర్ నుంచి ఎల్ఎండీకి నీటి విడుదలను అధికారులు నిలిపివేశారు. కొన్ని రోజులుగా ప్రాజెక్టు నుంచి ఎల్ఎండీకి నీటిని తరలిస్తున్నారు. రెండు రోజులుగా ఎగువన కురిసిన వర్షాలకు ప్రాజెక్టుకు భారీగా వరద రావడంతో ముందు జాగ్రత్తగా ప్రాజెక్టు 22 గేట్లు ఎత్తి నీటిని వదిలారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 33,756 క్యూసెక్కుల వరద వస్తుంది. శుక్రవారం సాయంత్రానికి ప్రాజెక్టులో 27.5 టీఎంసీలకు గాను 19.66 టీఎంసీల నీరు నిల్వ ఉంది.