అధికారం అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ లీడర్ల దందాలు
మణిపుర్ఘటనలపై ప్రధాని మౌనమెందుకో?
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
సుల్తానాబాద్, వెలుగు: మానేరులో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాలో ప్రగతి భవన్ పెద్దల హస్తం ఉందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వని బీఆర్ఎస్ లీడర్లు అధికారం అడ్డం పెట్టుకుని దందాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలో, ఎలిగేడు మండలం నర్సాపూర్ లో ఆదివారం బీఎస్పీ జెండాలు ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. ఎలిగేడు మండలం రామునిపల్లి గ్రామంలో స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెండువేల ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేయాలని చూస్తుండగా, అక్కడి గ్రామ మహిళా సర్పంచ్ అడ్డుకున్నారని చెప్పారు. ఈ జాగాలో మెడికల్ కాలేజ్ కట్టేందుకు ఎమ్మెల్యే ప్లాన్ వేశాడని ఆరోపించారు. ఏనాడో ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించుకున్న పేదలకు 60 గజాల స్థలానికి రూ .2 లక్షల నుంచి 5 లక్షల వరకు చెల్లిస్తేనే రెగ్యులరైజ్ చేస్తామని ప్రభుత్వం బెదిరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నయా పైసా లేకుండా పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మణిపుర్లో మహిళలపై జరుగుతున్న దాడులపై ప్రధాని మౌనం పాటించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. యాత్రలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి దాసరి ఉష, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి హనుమయ్య, జిల్లా అధ్యక్షుడు జి. రాజు, వెంకటేశ్తదితరులు పాల్గొన్నారు. కాట్నపల్లిలో ఈరగోని మహేశ్అనే దివ్యాంగుడితో ముచ్చటించారు. ఆయనకు 90 శాతం వైకల్యం ఉన్నట్టు సర్టిఫికెట్ ఇచ్చినప్పటికీ పెన్షన్ మాత్రం ఇవ్వడం లేదని, దివ్యాంగులపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటి తో దీని ద్వారా అర్థమవుతోందన్నారు.