ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. గుంటూరు జిల్లా మంగళగిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) రాజీనామా వెనక కారణాలు ఇవే అంటూ ప్రచారం జరుగుతోంది. నారా లోకేష్ ను ఓడించిన ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన ఆయన.. నియోజకవర్గంలో అభివృద్ధి కూడా బాగా చేశారు. రాబోయే ఎన్నికల్లో సీటు విషయంలో సీఎం వైఎస్ జగన్ నుంచి క్లారిటీ లేకపోవటం ఒక కారణమైతే.. ఇటీవలే టీడీపీ నుంచి గంజి చిరంజీవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు.
రాబోయే ఎన్నికల్లో మంగళగిరి సీటు చిరంజీవికే అని అధిష్టానం కన్ఫామ్ చేసినట్లు సమాచారం ఉండటంతోనే.. ఆళ్ల రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. మంగళగిరి నియోజకవర్గంలో చిరంజీవికి చెందిన సామాజిక వర్గం (పద్మశాలి) ఓట్లు అత్యధికంగా ఉండడం.. ఫస్ట్ టైం చిరంజీవిపైనే కేవలం 14 ఓట్ల తేడాతో గెలిచారు ఆళ్ల.. రెండోసారి నారా లోకేష్ పై గెలిచాడు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆళ్లను కాదని.. రాబోయే ఎన్నికల్లో చిరంజీవికి సీటు ఇస్తారని ప్రచారం జరుగుతున్న క్రమంలోనే.. రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
మంగళగిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తన పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో ఆయన రాజీనామా చేశారు. స్పీకర్ కార్యదర్శికి రాజీనామా లేఖను ఆర్కే అందజేశారు. స్పీకర్‌కు పంపిన లేఖలో ఎలాంటి కారణాలను ప్రస్తావించలేదు. కేవలం పదవికి రాజీనామా చేసినట్లు మాత్రమే చెప్పారు. కొంతకాలంగా వైసీపీ పార్టీ వైఖరిపై ఆర్కే అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు... వైసీపీ పార్టీకి కూడా రాజీనామా చేశారని తెలుస్తోంది.