కర్ణాటకలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. బీదర్ ఘటన మరువకముందే.. మంగళూరులో మరో భారీ చోరీ జరిగింది. మంగళూరులోని కొటేకర్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లో చోరీకి పాల్పడ్డారు దుండగులు. బ్యాంక్ లో 15కోట్ల విలువైన బంగారం, 5 లక్షల క్యాష్ తో పరారయ్యారు. పట్టపగలే బ్యాంకులోకి ప్రవేశించి తుపాకులతో ఉద్యోగులు, ఖాతాదారులను భయపెట్టారు. చేతికి చిక్కిన నగలు, నగదుతో పరారయ్యారు దుండగులు.
ALSO READ | అరాచకమైన రివేంజ్ అంటే ఇదీ : పెట్రోల్ పోయలేదని.. బంకు కరెంట్ కట్ చేశాడు..!
మంగళూరు సిటీ పోలీస్ కమీషనర్ వివరాల ప్రకారం.. 25 నుండి 35 ఏళ్ల మధ్య వయస్సు గల ఐదు నుంచి ఆరుగురు మంది ముసుగులు వేసుకుని బ్యాంకులోకి ప్రవేశించారు. వారి దగ్గర పిస్టల్, తల్వార్, కత్తి వంటి ఆయుధాలు కూడా ఉన్నాయి. ఘటన జరిగిన సమయంలో బ్యాంకులో 45 మంది ఉద్యోగులు ఉన్నారు. నిందితులు హిందీలో మాట్లాడుతున్నారు. సిబ్బందిని బెదిరించి బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు తీసుకెళ్లారు. నిందితులు నల్లటి ఫియట్ కారులో అక్కడి నుంచి పారిపోయారు. చోరీకి గురైన వస్తువుల బంగారం విలువ సుమారు రూ.12-15 కోట్లు ఉంటుందని ప్రాథమిక అంచనా. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. నిందితులను పట్టుకునేందుకు పలు పోలీసు బృందాలను ఏర్పాటు చేశాం అని కమిషనర్ తెలిపారు.